సందీప్ ఈసారైనా హిట్ కొడతాడా?
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్థానం సినిమాలో నెగిటివ్ పాత్రతో కెరీర్ ను స్టార్ట్ చేసిన సందీప్ కిషన్, స్నేహ గీతం సినిమాతో హీరోగా మారాడు. తర్వాత రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో సోలో హీరోగా తన జర్నీని మొదలుపెట్టి, అప్పటి నుంచి హీరోగా సినిమాలు చేస్తూనే వస్తున్నాడు.
కానీ సందీప్ కెరీర్ లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ హిట్ ఉంది అంటే అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్. చివరిగా సందీప్ నుంచి వచ్చి మంచి పేరు తెచ్చుకున్న సినిమా అంటే నిను వీడని నీడను నేనే సినిమానే. కానీ ఆ సినిమా కూడా కమర్షియల్ గా వర్కవుట్ అవలేదు. రీసెంట్ గా ధనుష్ కెప్టెన్ మిల్లర్ లో ఓ కీలక పాత్రలో నటించాడు.
అయితే సోలో సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న సందీప్ కిషన్ నుంచి ఫిబ్రవరి 9న ఊరు పేరు భైరవకోన అనే సినిమా రాబోతుంది. వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్, పాటలు, ట్రైలర్ అన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలానే ఉన్నాయి. ఈ సినిమాతో సందీప్ ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఫిక్షనల్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా సందీప్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













