తమన్ ను టార్గెట్ చేస్తున్నారా?
ఎంత జాగ్రత్తగా ఉంటున్నా సరే షూటింగ్ లో ఉన్న సినిమాల నుంచి లీకులు మాత్రం ఆగట్లేదు. నెల ముందు గేమ్ ఛేంజర్ నుంచి జరగండి అనే పాట ఆన్ లైన్ లో చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. దిల్ రాజు లాంటి బ్యానర్ నుంచి వచ్చే సినిమా కాబట్టి సెక్యూరిటీ గట్టిగానే ఉంటుంది. అయినా సరే ఆ సంస్థ నుంచే పాట లీకవడం అనేది ఎవరూ ఊహించని ట్విస్ట్. దీంతో రిలీజ్ విషయంలో క్లారిటీ లేకపోయినా లీకైన సాంగ్‌ను దీపావళికి రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
ఇక తాజాగా గుంటూరు కారం సినిమా నుంచి కూడా ఇలాంటి లీకు నెట్టింట తెగ షేర్ అయింది. ఆడియా క్లారిటీ లేకపోయినా, ఆ లిరిక్స్, మ్యూజిక్ విని ఈ పాట గుంటూరు కారందేనని అందరికీ క్లారిటీ వచ్చేసింది. సర్కారు వారి పాట టైమ్ లో కూడా కళావతి సాంగ్ ఇంతే ఆన్‌లైన్‌లోకి వచ్చింది. అయితే ఈ లీకులన్నీ తమన్ మ్యూజిక్ లో వస్తున్న సినిమాలే కావడం విశేషం.
వందల కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాల నుంచి పాటలు లీక్ అవడం, అది కూడా ప్రతీసారీ తమన్ పాటలే కావడంతో కావాలనే తమన్ ను టార్గెట్ చేస్తున్నారా అని అనుమానాలొస్తున్నాయి. ఏదైనా సరే జరిగిన నష్టాన్ని ఎలాగూ భర్తీ చేయలేం కాబట్టి ఇకనైనా నిర్మాణ సంస్థలు ఇలాంటి లీకులు కాకుండా జాగ్రత్త పడితే మంచిది.













