పవన్‌కల్యాణ్ 29వ సినిమాకి దర్శకుడు కన్ఫర్మ్ అయ్యాడా?
అజ్ఞాతవాసి తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకొని మళ్లీ సినిమాలు చేయడానికి రెడీ అయిన పవన్‌కల్యాణ్‌కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో భారీ ట్వీట్స్ చేయడం ద్వారా ప్రపంచ రికార్డును సృష్టించిన పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ అతనికి ఉన్న క్రేజ్‌ను తెలియజేశారు. వకీల్‌సాబ్ చిత్రాన్ని ఎనౌన్స్ చేయడం, ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వడంతో పవన్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. అంతేకాదు, ఆ సినిమా తర్వాత పవన్ చేయబోతున్న సినిమాలు వరసగా బయటికి వస్తుంటే అభిమానుల్ని పట్టుకోలేకపోతున్నారు. అతనితో సినిమాలు చేసేందుకు దర్శకులు క్యూలో ఉన్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న వకీల్ సాబ్ చిత్రాన్ని దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో నిర్మిస్తున్నాడు.
బోనీకపూర్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. థమన్ సంగీతమందిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఎ.ఎం.రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ సినిమాగా నిర్మిస్తున్నారు. కొంత టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. అలాగే గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్. ఇవికాక మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇప్పుడు పవన్‌కల్యాణ్ 29వ సినిమాను ఎవరు డైరెక్ట్ చెయ్యబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. పవన్‌కి సన్నిహితుడు త్రివిక్రమ్‌కే ఆ బాధ్యత అప్పగిస్తారని అనుకున్నారు. కానీ, సురేందర్‌రెడ్డి, సుకుమార్ ఆ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఉందన్న టాక్ వినిపించింది. తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. అది గోపీచంద్ మలినేని పేరు. ప్రస్తుతం రవితేజతో `క్రాక్` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న గోపీచంద్‌కి ఆ అవకాశం దక్కనుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు పవన్‌కల్యాణ్ చేస్తున్న సినిమాలు అధికారికంగా ప్రకటించినవి. గోపీచంద్ మలినేనితో పవన్ సినిమా చేయనున్నారన్న వార్తను అధికారికంగా ఏ నిర్మాతా ప్రకటించలేదు.













