ప్రతినిధి2 టార్గెట్ ఎవరు?
డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలు చేస్తూ, తన టాలెంట్‌ను నిరూపించుకున్న నారా రోహిత్ కు టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. రోహిత్ వెండితెరపై కనిపించి చాలా రోజులైంది. తనకు బాగా పేరు తెచ్చిన సినిమాల్లో ఒకటైన ప్రతినిధి సినిమా 2014లో రిలీజై బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేసింది. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత నారా రోహిత్ ఆ సినిమాకు సీక్వెల్ గా ప్రతినిధి2తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
టీవీ5 మూర్తి దర్శకత్వంలో ఈ సినిమా రానుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతుంది. ప్రస్తుత ఏపీ రాజకీయ వాతావరణం చాలా వేడెక్కిన నేపథ్యంలో అధికార పార్టీ పాలనపై ప్రజలు, ప్రతిపక్షం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్ని ప్రతినిధి2లో స్పష్టంగా చెప్పనున్నారని ఇన్సైడ్ టాక్. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా చేయనున్నట్లు తెలుస్తోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే సినిమాకు మొత్తం మీద ఉన్న టైమ్ ఆరు నెలలే. ఈ లోపు షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ విషయంలో చిత్ర యూనిట్ చాలా ప్లాన్డ్ గా ఉన్నారని తెలుస్తోంది.
ఏపీ మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి మద్దుతుగానే ఈ సినిమా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికి తోడు సీఎం జగన్‌పై సెటైర్లు, అధికార పార్టీ నాయకుల అవినీతి, మూడు రాజధానులు, ఇలాంటి మిగిలిన అంశాలపై కూడా సీన్స్ ఉండొచ్చని తెలుస్తోంది. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.













