The India House: నిఖిల్ సినిమా సెట్స్ లో ప్రమాదం
యంగ్ హీరో నిఖిల్ (Nikhil) నటిస్తున్న తాజా సినిమా ది ఇండియా హౌస్ (The India House) సెట్స్ లో ప్రమాదం జరిగింది. శంషాబాద్ సమీపంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా, సినిమాలోని కీలక సన్నివేశం కోసం చిత్ర యూనిట్ ఓ భారీ వాటర్ ట్యాంక్ ను సెట్ వేసింది. ఆ ట్యాంక్ ఒక్కసారిగా పగలడంతో ఒక్కసారిగా సెట్ మొత్తం జలమయం అవడంతో పాటూ పలువురుకి గాయాలయ్యాయి.
సినిమాకు పని చేస్తున్న అసిస్టెంట్ కెమెరామెన్ కు తీవ్ర గాయాలు కాగా, మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయి. గాయ పడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. ట్యాంక్ కూలిన తర్వాత సెట్స్ మొత్తం జలమయం అవడంతో సెట్స్ లో గందరగోళం నెలకొన్నట్టు వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది.
ప్రమాదం జరిగిన టైమ్ లో హీరో నిఖిల్ సెట్స్ లో ఉన్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదంపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడింది లేదు. ఈ సినిమాను వంశీ కృష్ణ తో కలిసి హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో సముద్ర నేపథ్యంలో వచ్చే ఓ కీలక సీన్ షూటింగ్ కోసం ఈ వాటర్ ట్యాంక్ సెట్ వేయగా, ఆ ట్యాంక్ కూలి ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.






