ఆ డైరక్టర్ తో మైత్రీ తో ప్రభాస్ మూవీ..?
ఇండియన్ స్టార్ హీరోలలో ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్నంత క్రేజ్ ఎవరికీ లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అతనితో చేయాలనుకుంటున్న ప్రతీ సినిమాకూ వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. ప్రతీదీ పాన్ ఇండియా లెవల్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇంత భారీ ప్లానింగ్ అన్న తర్వాత ఒక సినిమా ఫినిష్ చేసి మరో దానికి వెళ్దామనుకుంటారు కానీ ప్రభాస్ మాత్రం డిఫరెంట్ గా వరుసపెట్టి భారీ భారీ సినిమాలు ఓకే చేస్తున్నాడు.
సాహో వరకు కొంచెం ఆచితూచి వ్యవహరించిన ప్రభాస్, ఆ తర్వాత మాత్రం ఆగట్లేదు. రాధేశ్యామ్ సెట్స్ మీద ఉండగానే, నాగ్ అశ్విన్ సినిమా, ఆది పురుష్, సలార్ లను లైన్ లో పెట్టాడు. వీటిలో ఇప్పటికే సలార్, ఆది పురుష్ లు షూటింగ్ కూడా స్టార్ట్ చేసుకున్నాయి. వీటితో పాటూ రాధే శ్యామ్ బ్యాలెన్స్ షూటింగ్ కూడా ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ మూడు సినిమాలు కంప్లీట్ చేసి ఆ తర్వాత నాగ్ అశ్విన్ తో సినిమా చేయాల్సి ఉంది ప్రభాస్. చేతిలో ఇన్ని సినిమాలు పెట్టుకున్న హీరో అవన్నీ పూర్తి చేసి కానీ వేరే సినిమాల జోలికి పోడు. కానీ ప్రభాస్ మాత్రం ఇంకో క్రేజీ ప్రాజెక్టు కు సంతకం చేసినట్లు తెలుస్తుంది. ప్రభాస్ తో త్వరలోనే మళ్లీ సినిమా చేయబోతున్నట్లు క్లూ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్, ఇప్పుడు అనుకున్నట్లే ఆ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం చేసిందట.
ఈ సినిమాకు బాలీవుడ్ డైరక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్నాడట. వార్ సినిమాతో బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరక్టర్ల లిస్ట్ లోకి చేరిన సిద్ధార్థ్ ప్రస్తుతం షారుఖ్ హీరోగా పఠాన్ తెరకెక్కిస్తున్నాడు. దీని తర్వాత ప్రభాస్, హృతిక్ రోషన్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తాడని ఆ మధ్య వార్తలొచ్చాయి. మరి ఆ వార్తల సంగతి ఏమైందో తెలీదు కానీ ఇప్పుడు మైత్రీ నుంచి అతను అడ్వాన్స్ కూడా తీసుకున్నాడని, ప్రభాస్ తో సినిమా చేసేందుకు ఓకే అన్నాడని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది? దీనికి సంబంధించిన మిగిలిన వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశముందట.













