వర్మ మారాలంటున్న వి.వినాయక్…
ఈ మధ్య కాలంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీరు తెన్నుల గురించి ఆయన అంటే పడనివారి కన్నా ఆయనను ఇష్టపడేవారే ఎక్కువ బాధపడుతుండడం కనిపిస్తోంది. ఎంతో ప్రతిభ ఉన్న క్రేజీ డైరెక్టర్ అయిన వర్మ మరింతగా ఎదగాలని కోరుకుంటున్న ఆయన అభిమాన సినీ ప్రముఖులు అలా జరగాలంటే ఆయన మారాల్సిందేనన్నట్టు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ జాబితాలో టాలీవుడ్ డైరెక్టర్ వి.వినాయక్ కూడా చేరారు.
తాను రామ్‌గోపాల్ వర్మకు అభిమానినని, తనలాంటి దర్శకులు ఎందరికో ఆయన స్ఫూర్తిని అందించారని వినాయక్ చెప్పారు. ఇటీవల ఓ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… వర్మ సాదా సీదా దర్శకుడు కాదని ఆయన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ ఆ తర్వాత హాలీవుడ్‌కి కూడా పనిచేసే సత్తా ఉన్నవాడని అన్నారాయన. అలాంటి రామ్ గోపాల్ వర్మ ఇటీవల అనవసరమైన వివాదాలకు కారణమవుతున్న సినిమాలు తీస్తూండడం పట్ల ఆయన బాధను వ్యక్తం చేశారు.
ఆయన తీసే కొన్ని సినిమాలు కొందరిని బాధపెట్టేలా ఉన్నాయంటూ వినాయక్ అభిప్రాయపడ్డారు. అలాంటి సినిమాలు తీయడం అనవసరమని, పైగా వాటి వల్ల వర్మకు ఒనగూరే ప్రయోజనం కూడా ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు. నిజానికి వర్మ అంత తెలివైన, పలు అంశాలపై సమగ్ర అవగాహన ఉన్నవారు మరెవరూ లేరని తానైతే చూడలేదన్నారు. వర్మ తనకు ఏ మాత్రం ఉపయోగం లేని సినిమాలు తీస్తున్నారనేది వర్మను అభిమానించే ఆయన విజయాలు కోరుకునే వ్యక్తిగా తన అభిప్రాయం మాత్రమేనని అన్నారాయన. మరి తన శిష్యుడిలాంటి వినాయక్ చెప్పిన మాటకు వర్మ ఏమంటారో? మారతారో… ఎప్పటిలానే అంతా నా ఇష్టం అని ఊరుకుంటారో…













