బాలయ్య, సమంత తర్వాత విశ్వకే..
కేవలం తెలుగు కంటెంట్‌నే నమ్ముకున్న ఆహా ఓటీటీకి అప్పట్లో కొంచెం గ్యాప్ వచ్చి స్పీడ్ తగ్గింది కానీ ఇప్పుడు టాలీవుడ్ బ్లాక్ బస్టర్లు అయిన బేబీ, సామజవరగమన రెండూ ఓటీటీ రైట్స్ ఆహాకే దక్కడంతో ఈ ప్లాట్‌ఫామ్ మళ్లీ ఊపందుకుంది. ఈ ఫామ్ ను ఇలాగే కొనసాగించాలన్న ఉద్దేశంతో ఆహా యాజమాన్యం సినిమాలతో పాటూ టాక్ షో ల మీద కూడా తన దృష్టిని కేంద్రీకరించింది.
గతంలో సమంత హోస్ట్ గా సామ్ జామ్ ప్రోగ్రామ్ ని నిర్వహించి, చిరంజీవి, బన్నీ, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య లాంటి గెస్ట్ లను ఆ టాక్ షో కు రప్పించి ప్రేక్షకులకు మంచి వినోదం అందించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో చేసిన అన్‌స్టాపబుల్ షో ఆహా ను తర్వాతి స్థాయికి తీసుకెళ్లింది.
బాలయ్యను ఎప్పుడూ చూడని సరికొత్త యాంగిల్లో ఆవిష్కరించడంతో ఆ షో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ముఖ్యంగా పవన్, ప్రభాస్‌లతో చేసిన ఎపిసోడ్లు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో తెలిసిందే. ఈ రెండు ఎపిసోడ్లకు ఆహా యాప్ సైతం క్రాష్ అయిందంటే ఆ ఎపిసోడ్లకు ఎంతటి క్రేజ్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ ఫామ్ ను కొనసాగించేందుకు తాజాగా విశ్వక్ సేన్‌తో ఫ్యామిలీ ధమాకా అనే గేమ్ షో ను ప్లాన్ చేసింది ఆహా టీమ్. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ కూడా అయింది. ఈ షో కు సామాన్యలతో పాటూ ఇండస్ట్రీ ప్రముఖుల ఫ్యామిలీలు కూడా భాగం కానున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఫన్నీగా, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరి ఈ షో ఆహాకు ఎలాంటి మైలేజ్ ఇస్తుందో చూడాలి.













