ధమ్కీకి పది రెట్లు ఎక్కువగా సీక్వెల్
ఈ మధ్య సినిమా ఎలా ఉన్నా దాని క్లైమాక్స్ లో సీక్వెల్ గురించి హింట్ ఇవ్వడం ఫ్యాషనైపోయింది. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ముందుగా క్లైమాక్స్‌లో అనౌన్స్ చేసినట్లు రెండో పార్ట్ తెరకెక్కించడానికి రెడీ అయిపోతున్నారు మేకర్స్. రీసెంట్గ కన్నడ మూవీ కబ్జ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. కానీ సినిమా చివర్లో దీనికి సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు.
అందులో భాగంగానే సినిమా ఘోరంగా ఫెయిల్ అయినా, సీక్వెల్ కు కట్టుబడి, రీసెంట్గా షూటింగ్ కూడా పూర్తి చేశారు. టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అయ్యాక కూడా ఆ సినిమాకు సీక్వెల్ గా ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా తెరకెక్కించి మరింత పరాభవం ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే బాటలో వెళ్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా.
రీసెంట్గా విశ్వక్ సేన్ తెరకెక్కించిన దాస్ కా ధమ్కీ ఆడియన్స్‌ను అంతగా మెప్పించలేకపోయింది. విశ్వక్ ప్రమోషన్స్, ఫాలోయింగ్ వల్ల తన కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న దాస్ కా ధమ్కీ, తర్వాత మాత్రం డివైడ్ టాక్ తో నడిచింది. కంటెంట్ పరంగా చూస్తే ధమ్కీ ఫ్లాప్ సినిమా. అయినా సరే ఈ సినిమా సీక్వెల్ విషయంలో తగ్గేదేలే అంటూ ముందుకెళ్తున్నాడు విశ్వక్.
ఈ సినిమా క్లైమాక్స్ లో ధమ్కీ పార్ట్ 2 ఉంటుందని హింట్ ఇచ్చిన విశ్వక్, ఇప్పుడు ఆ సినిమాకు స్టోరీ రాయడంలో బిజీగా ఉన్నాడట. రీసెంట్ గా ఈ మూవీ ఆహా లో రిలీజై మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో విశ్వక్ మాట్లాడుతూ, ఈ సినిమా సీక్వెల్ కు స్క్రిప్ట్ రెడీ అవుతోందని, మొదటి భాగానికి పది రెట్లు మించి ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. అసలు ఫస్ట్ పార్టే అంతంతమాత్రంగా ఉన్నప్పుడు రెండో పార్ట్ ఎందుకని నెటిజన్లు విశ్వక్ ను ట్రోల్ చేస్తున్నారు.













