తెలుగు ‘లూసిఫర్’ లో విజయశాంతి?
మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ను తెలుగులో రీమేక్ చేయబోతున్నారన్న వార్త వచ్చిన దగ్గర్నుంచి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ చిత్ర యూనిట్‌కి తెలీకుండానే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని సుజీత్ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మించనున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ సినిమాలోని మిగతా పాత్రల్లో ఎవరెవరు నటిస్తారనే విషయాన్ని ప్రకటించలేదు. అయినా ఎవరెవరు ఏయే క్యారెక్టర్ చేయబోతున్నారనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి.
మలయాళ లూసిఫర్ చిత్రంలో మంజు వారియర్ ఒక కీలకమైన పాత్ర పోషించింది. మోహన్‌లాల్ భార్యగా నటించిన ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ క్యారెక్టర్లో జెనీలియా నటించబోతోందని, సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన ఆమె ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోందని వార్త వచ్చింది. ఇప్పుడా క్యారెక్టర్ గురించిన మరో కొత్త న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే విజయశాంతి ఆ క్యారెక్టర్లో నటించబోతోందట. ఇటీవల విడుదలై సూపర్‌హిట్ అయిన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన విజయశాంతి ఈ సినిమా తర్వాత మళ్లీ సినిమాలు చేసేది లేదని, తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేస్తానని ప్రకటించారు. మరి ఇప్పడు వినిపిస్తున్న వార్తలో ఎంత మాత్రం నిజంలేదని కొంతమంది వాదన.
అయితే చిరంజీవి కోసం విజయశాంతి ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిందని ప్రచారం జరుగుతోంది. అయితే లూసిఫర్ రీమేక్‌లో విజయశాంతి నటించబోతోందనే వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఈ సినిమా అప్డేట్స్ విషయానికి వస్తే.. మలయాళంలో ఈ సినిమా సూపర్‌హిట్ అయినప్పటికీ తెలుగు రీమేక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు కథలో చాలా మార్పులు చేస్తున్నారు.
చిరంజీవి కథలో కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి సూచనలు చేశారట. మార్పులతో కూడిన ఫైనల్ స్క్రిప్ట్‌ను చిరంజీవికి సుజీత్ వినిపించి ఓకే చేసుకున్నాడట. చిరంజీవి లుక్, స్టైల్, హీరోయిజం ఎలివేషన్ వంటి విషయాల్లో సుజీత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.













