మరోసారి విజయ్- సందీప్ రెడ్డి కాంబో!
తెలుగు సినీ ప్రేక్షకులకు అర్జున్ రెడ్డి మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా రిలీజ్ టైమ్ లో హీరో స్పీచ్ దగ్గర నుంచి, సినిమా కంటెంట్ వరకు ప్రతీదీ రచ్చ లేపిన విషయమే. ప్రతీ విషయంలోనూ అర్జున్ రెడ్డి మూవీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత అందరి మైండ్ సెట్స్ మారాయి. ఈ సినిమాను తీసేందుకు ఏ నిర్మాత ముందుకు రాకపోవడంతో తన సొంత డబ్బు, తన సోదరుడి హెల్ప్ తో ఈ సినిమాను తీశాడు సందీప్ రెడ్డి వంగా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సందీప్ కెరీర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్లింది. ఏకంగా ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోతో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. డిసెంబర్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి.
ఇదిలా ఉంటే ఖుషి మూవీ ప్రమోషన్స్ లో మైత్రీ నిర్మాతల్లో ఒకరైన రవి మాట్లాడుతూ, విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి కాంబోలో సినిమాను సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపాడు. ఈ విషయం విన్నాక ఇక విజయ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. రవి చెప్పినట్లు ఈ కాంబో సెట్ అయినా సరే అది పట్టాలెక్కేసరికి చాలానే టైమ్ పడుతుంది.
సందీప్ డిసెంబర్ వరకు యానిమల్ పనుల్లో ఉంటాడు. ఆ తర్వాత ప్రభాస్ స్పిరిట్ కోసం స్క్రిప్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ సినిమా పట్టాలెక్కి, పూర్తయ్యే సరికి 2025 దాటిపోతుంది. ఆ తర్వాత వీరి కాంబోలో సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ చేయాలి. కాబట్టి సందీప్, విజయ్ కాంబో మళ్లీ రిపీట్ అవాలంటే మినిమం మూడేళ్లు ఆగాల్సిందే.













