ఫ్యామిలీ స్టార్ వెనక్కు తగ్గినట్టేనా?
వచ్చే సంక్రాంతికి సినిమాలు చాలానే పోటీ పడనున్నాయి. గుంటూరు కారం, సైంధవ్, ఈగల్, హనుమాన్, ఫ్యామిలీ స్టార్, కెప్టెన్ మిల్లర్, లాల్ సలామ్, నా సామిరంగ సినిమాలు సంక్రాంతి బరిలో ఉన్నాయి. ఈ పోటీ నుంచి విజయ్ దేవరకొండ నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ తప్పుకోనుందని వార్తలొస్తున్నాయి. అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాత దిల్ రాజు ఆ మేరకు సమాచారం అందించాడని తెలుస్తోంది.
పోటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇతర సినిమాల థియేటర్ల అగ్రిమెంట్స్ మొదలయ్యాయి కాబట్టి ఏదైనా ఉంటే ఈ నెలలోనే ఫ్యామిలీ స్టార్ ను రిలీజ్ చేయాలా వద్దా అన్నది డిసైడ్ అవాలి. సినిమాను పూర్తి చేయాలని పరశురామ్ ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ వీసా సమస్య కారణంగా ఫారిన్ షెడ్యూల్స్ పూర్తి చేయలేకపోతున్నాడు.
వీసా సమస్య సాల్వ్ అవకపోవడంతో హడావిడి లేకుండా నెమ్మదిగా సినిమాను మార్చిలో రిలీజ్ చేద్దామని దిల్ రాజు డిసైడ్ అయ్యాడట. అంతేకాదు, గుంటూరు కారం నైజామ్ హక్కులతో పాటూ సైంధవ్ ఉత్తరాంధ్ర రైట్స్ కూడా తీసుకున్న దిల్ రాజు, వీటితో పాటూ తను నిర్మించే సినిమాను కూడా రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ పరంగా ఇబ్బందవుతుందని, అందుకే మంచి డేట్ చూసుకుని మార్చిలో సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నాడట. కానీ విజయ్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో సినిమా సంక్రాంతికి రానుందని చాలా నమ్మకంతో చెప్తున్నారు. ఏదేమైనా ఫ్యామిలీ స్టార్ రిలీజ్ విషయంలో మేకర్స్ ఓ క్లారిటీ ఇస్తే బావుంటుంది.













