హైప్ లేకపోయినా నిర్మాతల నమ్మకమేంటి?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగే ఉంది. తన కొత్త సినిమా గోట్ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో విజయ్ సినిమాలకు ఎప్పుడూ ఉండే క్రేజ్ ఈ సినిమాకు కనిపించడం లేదు. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
ఈ ఈవెంట్ లో సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను తీసుకున్న మైత్రీ సంస్థ నుంచి శశి మాట్లాడుతూ గోట్ కు తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారు ఝామున 4 గంటల షో ల కోసం పర్మిషన్స్ అడిగామని, వస్తే తప్పకుండా బెనిఫిట్ షోలు ఉంటాయని ఆయన వెల్లడించాడు. ఇప్పటివరకు విజయ్ సినిమాలకు ఇంత ఎర్లీ గా స్పెషల్ షో లు వేసింది లేదు.
కానీ మొదటిసారి డిస్ట్రిబ్యూటర్లు ఇంత ధైర్యంగా 4 గంటలకే షోలు వేయాలని ముందడుగేయడం చూస్తుంటే వారికి కంటెంట్ మీదున్న నమ్మకం అర్థమవుతుంది. అయితే ఆడియన్స్ నిద్రలు మానుకుని మరీ పొద్దున్నే లేచి థియేటర్లకు వెళ్లేంత స్టార్డమ్ తెలుగు రాష్ట్రాల్లో పవన్, మహేష్, ఎన్టీఆర్, బన్నీ, చరణ్, ప్రభాస్ లాంటి హీరోలకు మాత్రమే ఉంది. ఇప్పుడీ లిస్ట్ లో విజయ్ కూడా జాయిన్ అవాలని చూస్తున్నాడు. అంతా బాగుండి సినిమాకు మంచి టాక్ వస్తే ఈ బెనిఫిట్ షోలు సినిమాకు ప్లస్సయ్యే ఛాన్సుంది. ఎలాగూ తర్వాత రెండ్రోజులకు వినాయక చవితి రానుంది కాబట్టి వరుస సెలవులొస్తాయి. మరి విజయ్ ఈ సినిమాతో ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.













