వరుస సినిమాలతో బిజీగా ఉన్న రౌడీ హీరో
లైగర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న విజయ్ దేవరకొండ, రీసెంట్గా ఖుషి సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఆ సినిమా యావరేజ్ టాక్‌తో విజయ్‌కు ఆ సినిమా నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది ఇక విజయ్ నుంచి సినిమా వచ్చే ఛాన్స్ లేదు. కానీ వచ్చే సంవత్సరం మాత్రం తన నుంచి రెండు సినిమాలు రిలీజ్ చేయాలని చాలా గట్టిగా కష్టపడుతున్నాడు విజయ్.
అందులో భాగంగానే విజయ్, దిల్ రాజు బ్యానర్ లో పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్(వర్కింగ్ టైటిల్) అనే ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటూ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడు.
ఈ రెండు కాకుండా దిల్ రాజు బ్యానర్లో మరో రెండు సినిమాలకు కూడా విజయ్ అగ్రిమెంట్ చేసుకున్నాడని సమాచారం. అందులో ఒక సినిమా కొత్త డైరెక్టర్ తో, మరో సినిమా ఇంద్రగంటి మోహనకృష్ణతో ఉండనుంది. వీటితో పాటూ మైత్రీ మూవీ మేకర్స్ లో విజయ్ మరో రెండు సినిమాలకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండిట్లో ఒకటి సందీప్ రెడ్డి వంగతో, మరొకటి మలయాళ డైరెక్టర్ టిను పపాంచన్తో ఉండనున్నాయట. మొత్తానికి విజయ్ చేతిలో ఆరుకు పైగా సినిమాలున్నాయన్నమాట. ఇదంతా చూస్తుంటే విజయ్ డేట్స్ మరో మూడేళ్ల వరకు ఖాళీ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.













