సీమ యాసలో డైలాగ్స్ చెప్పనున్న రౌడీ హీరో
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. అయినా సరే తన జోరు మాత్రం ఏం తగ్గలేదు. ఇప్పటికీ విజయ్ తో సినిమాలు చేయడానికి దర్శకనిర్మాతలు ఇంట్రెస్టింగ్ గానే ఉన్నారు. ఫ్యామిలీ స్టార్ పెద్ద డిజాస్టర్ అయినా కూడా విజయ్ మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు విజయ్.
ఇది కాకుండా రాజా వారు రాణి వారు ఫేమ్ రవికిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో కూడా ఓ సినిమాను లైన్ లో పెట్టాడు. ఆ సినిమాకు రౌడీ జనార్ధన్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు రీసెంట్ గా వార్తలొచ్చాయి. ఇప్పుడు విజయ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాను విజయ్ కు ట్యాక్సీవాలా లాంటి హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృత్య్సన్ తో చేస్తున్నాడు.
ట్యాక్సీవాలాతో మంచి హిట్ అందుకున్న రాహుల్ ఆ తర్వాత చాలా కాలానికి నానితో శ్యామ్ సింగరాయ్ చేసి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ సినిమా వచ్చి రెండేళ్లవుతుంది. ఇప్పటికీ రాహుల్ మరో సినిమాను అనౌన్స్ చేసింది లేదు. ఇప్పుడు తన మూడో సినిమాను రాహుల్, విజయ్ తో చేయబోతున్నాడు. రాయలసీమ నేపథ్యంలో ఓ పీరియాడికల్ డ్రామాను రాహుల్ ఈ సారి తీయబోతున్నాడట. విజయ్ ఇప్పటివరకు సీమ యాసలో డైలాగ్స్ చెప్పింది లేదు. దీంతో అందరూ సీమ యాసను విజయ్ ఎలా మేనేజ్ చేస్తాడా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.













