Vijay Devarakonda: అర్జున్ రెడ్డికి విజయ్ ఎంత తీసుకున్నాడంటే?
క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ను మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ(Vijay devarakonda) ఆ తర్వాత పెళ్లి చూపులు(Pelli Choopulu) సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతో మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్న విజయ్, రెండో సినిమాగా అర్జున్ రెడ్డి(Arjun Reddy)ని చేశాడు. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో రౌడీ హీరోగా పేరు తెచ్చుకోవడంతో పాటూ ఆ సినిమాలోని తన యాటిట్యూడ్ తో విజయ్ ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాదించుకున్నాడు.
అర్జున్ రెడ్డి మూవీ సక్సెస్ విజయ్ కెరీర్ ను ఎంతలా మార్చేసిందంటే విజయ్ అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది అర్జున్ రెడ్డి సినిమానే అనేంతలా. కాగా తాజాగా కింగ్డమ్(kingdom) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమా ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్నాడు. అందులో భాగంగానే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అర్జున్ రెడ్డి రోజుల్ని గుర్తు చేసుకున్నాడు విజయ్.
అర్జున్ రెడ్డి సినిమాకు తాను కేవలం రూ.5 లక్షలు రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నానని, కానీ తనకు అప్పుడదే చాలా ఎక్కువని చెప్పిన విజయ్, సినిమా తర్వాత తనకు వచ్చిన బెస్ట్ యాక్టర్ అవార్డును వేలం వేయగా దానికి రూ.25 లక్షలు వచ్చాయని, అవన్నీ తాను సొసైటీకి ఇచ్చేసినట్టు చెప్పాడు. ఏదేమైనా అప్పుడు లక్షల్లో ఛార్జ్ చేసిన విజయ్ ఇప్పుడు ఒక్కో సినిమాకు కోట్లలో ఛార్జ్ చేయడం మాత్రం విశేషం.







