మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విజయ్ దేవరకొండ?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న `ఆచార్య` చిత్రం షూటింగ్ లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉండడంతో షూటింగ్ చేయడానికి చాలా మంది హీరోలు ఇష్టపడడం లేదు. అందువల్లే `ఆచార్య` షూటింగ్‌ని కూడా జరగడం లేదు. అయితే ఈ సినిమా తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాకి సంబంధించిన అప్డేట్స్ మాత్రం తరచూ వస్తున్నాయి. మలయాళంలో సూపర్‌హిట్ అయిన `లూసిఫర్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో ఎవరెవరు నటించే అవకాశం ఉందనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడీ సినిమాకి సంబంధించిన కొత్త అప్డేట్ వచ్చింది. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో నటించే అవకాశం ఉందనేది ఆ వార్త. మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన `లూసిఫర్` అక్కడ చాలా పెద్దహిట్ అయింది. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా పృథ్విరాజ్ స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చాడు. తెలుగులో ఆ క్యారెక్టర్‌ను విజయ్ దేవరకొండతో చేయించాలని చిత్ర యూనిట్ భావిస్తోందని సమాచారం. గీతా ఆర్ట్స్ బేనర్లో విజయ్ నటించిన `గీతగోవిందం` చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా ఫంక్షన్‌కి హాజరైన చిరంజీవి.. విజయ్ నటనపై ప్రశంసలు కురిపించాడు. ఈ కారణాల వల్ల విజయ్ `లూసిఫర్`లో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.













