సీఎం సహాయనిధికి విజయ్ దేవరకొండ భారీ విరాళం
ప్రముఖ సినీ హీరో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి సహాయనిధికి భారీ విరాళం ఇచ్చారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి కే తారకరామారావును కలిసి రూ.25 లక్షల చెక్కును అంందజేశారు. తనకు వచ్చిన తొలి ఫిలింఫేర్ అవార్డును వేలం వేసి వచ్చిన డబ్బును సీఎం సహాయనిధికి ఇస్తానని పురస్కారం స్వీకరించిన రోజున పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా తన అవార్డును వేలం వేయగా రూ.25 లక్షలు వచ్చిందని, దానిని అందజేశానని విజయ్ మంత్రికి వివరించారు. ఆయన విజయ్ను అభినందిస్తూ మొక్కును బహుకరించారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని, హైదరాబాద్ నగరపాలక సంస్థ చేపట్టిన జలం జీవం పథకం కింద ప్రారంభించిన ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రజలను చైతన్య వంతం చేయాలని కోరారు. దీనికి విజయ్ అంగీకరించారు. తన సొంత బ్రాండ్‌పై వస్త్రాల అమ్మకాలను జరుపుతున్నామని విజయ్ చెప్పగా, ఈ వస్త్రాలను రాష్ట్రంలోనే తయారు చేయించాలని మంత్రి సూచించారు. గుండ్ల పోచంపల్లిలోని అపెరల్ పార్కు యజమానులతో దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి విజయ్ అంగీకరించారు. కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శి సోమేశ్‌కుమార్ పాల్గొన్నారు.













