విజయ్ తో సుక్కు సినిమా ప్రయోగమే..
తన ప్రతి సినిమాతో కొత్తగా ప్రయోగం చేసి క్రియేటివ్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సుకుమార్. సుకుమార్ కథపై చేసే కసరత్తు అలా ఉంటుంది. హీరో లుక్ దగ్గర నుంచి ప్రతీ విషయంలోనూ ఆయన కొత్తదనం కోరుకుంటాడనే విషయం అందరికీ తెలుసు. ఆయన తీసిన ప్రతీ సినిమా క్రియేటివ్ గా, ఎంతో ఆలోచించే విధంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్య ప్రేక్షకుడికి ఒక పట్టాన సుకుమార్ సినిమా అర్థం కాదనే టాక్ కూడా బయట ఉంది. అలాంటి సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ కూడా చేశారు. రిలీజ్ డేట్ కూడా ప్రకటించడంతో ఎలాంటి బ్రేక్స్ లేకుండా షూటింగ్ నిర్విరామంగా చేస్తున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. పుష్ప తర్వాత సుకుమార్ చేసే సినిమా కూడా ఇప్పటికే అనౌన్స్ అయింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో తన తదుపరి సినిమాను చేయనున్నాడు సుకుమార్. మామూలుగా అయితే సినిమా ఈ ఇయర్ స్టార్ట్ అవుతుందనుకున్నారు కానీ ఈ ఏడాది సినిమా సెట్స్ పైకి వెళ్లడం కష్టం లానే ఉంది. సుకుమార్ విజయ్ కు కేవలం స్టోరీ లైన్ మాత్రమే చెప్పాడట. దానికి సంబంధించిన కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేయడానికి ఇంకా టైమ్ పడుతుంది. డిఫరెంట్ జోనర్ లో ఉండే ఈ సినిమా సుకుమార్ నుంచి మరో కొత్త ప్రయోగమే అని చెప్తున్నారు సన్నిహితులు.













