జీవితంలో చెప్పులేసుకోనంటున్న విజయ్ ఆంటోనీ
పూర్వపు రోజుల్లో మన పెద్దవాళ్లంతా ఎండలో కాళ్లు కాలుతున్నా, రాళ్లు, ముళ్లు గుచ్చుకున్నా కూడా చెప్పులు లేకుండానే తిరిగేవారు. అప్పట్లో చెప్పులేసుకున్న వాళ్లంటే ఎంతో డబ్బున్నోళ్లని అర్థం. కానీ మారిన రోజుల్లో బయటే కాదు, ఇంట్లో కూడా చెప్పుల్లేకుండా నడవలేకపోతున్నారు. ఇలాంటి రోజుల్లో ఓ నటుడు చెప్పుల్లేకుండా తిరుగుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
అతను మరెవరో కాదు విజయ్ ఆంటోనీ. ఆయన కొన్ని నెలలుగా చెప్పులు లేకుండానే కనిపిస్తున్నాడు. అలా అని ఆయనేమీ దేవుడి మాల ధరించడమో, దీక్ష తీసుకోవడమో చేయలేదు. ఈ విషయమై రీసెంట్ గా విజయ్ ఆంటోనీ క్లారిటీ ఇచ్చాడు. కొన్ని నెలల కిందట చెప్పుల్లేకుండా నడిచి చూద్దామనుకుని ట్రై చేశానని, అలా నడవడం తనకెంతో బాగా అనిపించిందని, అప్పట్నుంచి అదే కంటిన్యూ చేస్తున్నానని విజయ్ తెలిపాడు.
అంతేకాదు చెప్పుల్లేకుండా నడవడం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని, మనపై మనకు నమ్మకాన్ని కలిగిస్తుందని, చెప్పుల్లేకుండా నడవడం వల్ల తాను ఎలాంటి ఒత్తిడి, అసౌకర్యానికి గురి కాలేదని విజయ్ చెప్పాడు. ఇక జీవితమంతా చెప్పులేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు కూడా విజయ్ తెలిపాడు. కాగా విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమాలో విజయ్ కొంత సేపు చెప్పులు లేకుండా నటించిన విషయం తెలిసిందే.













