సోషల్ మీడియా నుంచి సినిమా హీరోయిన్ వరకు!
సినిమాల్లో అవకాశాలు రావాలంటే కేవలం ప్రతిభ ఉంటే చాలదు, దాన్ని నిరూపించుకునే వేదిక కావాలి. ఒకప్పుడు సినిమాల్లో అవకాశాలు రావాలంటే నాటకాల్లో నటించడం ద్వారా సినీ ప్రముఖుల దృష్టిలో పడితే తమ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చేవారు. అది తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే ఇప్పుడున్నన్ని మాధ్యమాలు అప్పుడు లేవు. కానీ, ఇప్పుడలా కాదు, ప్రతిభ ఉండి దాన్ని సక్రమమైన మార్గంలో జనంలోకి తీసుకెళ్తే అవకాశాలు వాటంతట అవే వస్తున్నాయి. అలా ఈ మధ్యకాలంలో చాలామంది సినిమాల్లో అవకాశాలు సంపాదించుకున్నారు. సోషల్ మీడియాలో తమ ప్రతిభ నలుగురూ చూసేలా చేసుకొని సినిమాల్లో అవకాశాలు పొందినవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి అవకాశమే ఓ అందాల ముద్దుగుమ్మను వరించింది. బన్నీ వాక్స్ పేరుతో వీడియోలు చేస్తూ టిక్ టాక్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వర్షిణికి సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది.
టిక్‌టాక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వర్షిణికి వేల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ అమ్మడు ఒక వీడియోను పోస్ట్ చేస్తే చాలు వేల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి. ఒక హీరోయిన్‌కి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్న వర్షిణి ఇప్పుడున్న హీరోయిన్స్ కంటే అద్భుతమైన ప్రతిభ కనబరుస్తోంది. దీంతో ఆమె పాపులారిటీ రోజు రోజుకీ పెరుగుతోంది. ఆ పాపులారిటీతోనే `విద్యార్థి` అనే సినిమాలో హీరోయిన్గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో చేతన్ చీను సరసన నటించనుంది. మధు మదాసు దర్శకత్వం వహించే ఈ సినిమాతో తెరంగేట్రం చేసేందుకు వర్షిణి సిద్ధంగా ఉంది. తిరుపతికి చెందిన 18 ఏళ్ళ వర్షిణి మాట్లాడుతూ “నేను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇది సరైన టైమ్ అనుకుంటున్నాను. నేను ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నప్పటికీ నేను ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. నా ప్రతిభను మరోసారి ప్రదర్శించేందుకు ఈ సినిమా మంచి వేదిక అవుతుందని భావిస్తున్నాను“ అంటోంది.













