బాలీవుడ్ లో మరో బయోపిక్ ?
బాలీవుడ్లో మరో ఆసక్తికరమైన బయోపిక్కు సన్నాహాలు జరగుతున్నాయి. తన మేథస్సుతో ప్రపంచాన్ని అబ్బురపరచి మానవ కంప్యూటర్‌గా పేరొందిన ప్రసిద్ధ గణిత మేథావి, రచయిత్రి శకుంతలా దేవి జీవితకథతో ఓ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. కేరళకు చెందిన దర్శకురాలు అను మేనన్ తెరకెక్కించబోయే ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మించనున్నారట. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటిస్తారని వినిపిస్తోంది. మరో కీలక పాత్ర కోసం దంగల్ నటి సన్యా మల్హోత్రాను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. తన ప్రతిభతో గిన్నిస్ బుక్ స్థానంలో సంపాదించుకున్న శకుంతలా దేవి బహుముఖ ప్రజ్ఞాశాలి. గణితంతో పాటు జ్యోతిషంలోనూ ప్రావీణం ఉంది. రచయిత్రిగా నవలలు రాశారు. స్వలింగ సంపర్కులపై ది వరల్డ్ ఆఫ్ హోమ్ సెక్కువల్స్ పుస్తకాన్ని రచించారు. ఆ పార్శ్వాలను ఈ చిత్రంలో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.













