ఘనవిజయాల పర్వం.. గాన గాంధర్వం..
గానం గంధర్వలోకం చేరింది. పాటల బాలుడు దివికేగాడు. స్వర్గపురిలోని దేవతలకు వీనుల విందు చేయడానికి కమ్మని గాత్రం తరలివెళ్లింది. శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం కన్నా మా బాలు గానే అందరికీ ఆప్తుడైన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం (74)మరి లేరు. నలభై వేలకు పైగా పాటలను మరెన్నో బహుమతలను మనకిచ్చి ఇచ్చి అలసిపోయారేమో… శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. తుదికంటా పాటలలోకంలోనే విహరించిన ఆయన ఆయన చివరగా పలాస సినిమా కోసం పాట పాడారు. బాలు జీవిత భాగస్వామి సావిత్రి పిల్లలు చరణ్, పల్లవి
నెల్లూరి నుంచి..స్వరాలూరి…
గాన గంధర్వుడిగా మనకు చిరపరిచితమైన ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం నెల్లూరు జిల్లా లోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో 1946 జూన్ 4న జన్మించారు. బాలు తండ్రి సాంబమూర్తి, పేరొందిన హరికథా పండితుడు. తల్లి శకుంతలమ్మ. ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు. ఆయన నేపథ్య గాయకుడు మాత్రమే కాదు సంగీత దర్శకుడు, నటుడు కూడా. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 41వేలకుపైగా పాటలు పాడారాయన. తండ్రి శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచే సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. శకుంతలమ్మ (తల్లి), తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సులో చేరి. చదువుకుంటూనే వేదికల మీద పాటలు పాడుతూ బహుమతులు గెల్చుకున్నారు.
సినీ తోటలో విరిసిందిలా..విహంగమైందలా..
తొలిసారిగా 1966 లో పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది.. ఈ చిత్రానికిఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వము వహించాడు. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు “కోదండపాణి ఆడియో ల్యాబ్స్” అని అతని పేరే పెట్టుకున్నాడు బాలు.తర్వాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాదుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడడంలో ఆయనకు సాటి లేదు.
నట పాండిత్యమూ…
తొలిసారిగా 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు ఎస్పీబీ.. 1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో కథానాయకుడినా నటించారు.. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాప లాలీ పేరుతో అనువాదం అయింది. ఇంకా ప్రేమ (1989), ప్రేమికుడు (1994), పవిత్రబంధం (1996), ఆరో ప్రాణం (1997), రక్షకుడు (1997), దీర్ఘ సుమంగళీ భవ (1998) వంటి సినిమాల్లో ప్రాధాన్యత కలిగిన సహాయ పాత్రలు పోషించారు. 2012 లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో కథానాయకుడిగా నటించగా, ఇందులో లక్ష్మి నాయికగా నటించించారు.
డబ్బింగ్ కళాకారుడిగానూ..
కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో బాలు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారాడు. అందులో కమల్ హాసన్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశాడు. తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి ఈయనే డబ్బింగ్ చెబుతుండేవాడు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పాడు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది. ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేసారు. అనేక మంది కొత్త గాయనీ గాయకులను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేసారాయన. ఈటీవీలో ప్రసారమైన స్వరాభిషేకం కార్యక్రమం ఆయన్ను ఇంటింటికీ ఆప్తుడ్ని చేసింది.
గానం..బహుమానం…
సుదీర్ఘ గాన ప్రస్థానంలో ఎస్పీబీ అందుకున్న పురస్కారాలెన్నో.. అందులో ముఖ్యంగా కేంద్రప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. . 41ఏళ్లకు పైగా సాగిన సినీప్రస్తానంలో 11 భాషలలో 40 వేల పాటలు పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. తెలుగు, తమిళమే కాకుండా కన్నడంలో కూడా అతను పాడిన పాటలకి జాతీయ పురస్కారాలు లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నారు. విశేషం ఏమిటంటే.. గాయకుడిగానే కాకుండా నటుడిగానూ అనేక పురస్కారాలు దక్కించుకోవడం. ఆయన 2012 లో నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది. 2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అతనికి శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని (సెంటినరీ అవార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2016) ప్రదానం చేసారు.
భారతీయ భాషల్లో ఆయన సుమారు 40 వేలకు పైగా పాటలు పాడాడు. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత సాగర సంగమం (1983), రుద్రవీణ (1988) చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు.













