కె.రాఘవ ఇకలేరు
ఆఫీస్బోయ్గా తన కెరీర్ ప్రారంభించి, ప్రొడక్షన్ మేనేజర్‌గా ఎదిగి ఆపై నిర్మాతగా మారిన కె.రాఘవ కన్ను మూశారు. నూట మూడు సంవత్సరాల వయసు కలిగిన కె.రాఘవ తుది శ్వాస విడిచే ముందు వరకు సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే స్వల్ప ఆస్వస్థతకు లోనైన కె.రాఘవ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెలవు తీసుకున్నారు. జగత్ కిలాడీలు, జగత్జెంత్రీలు, తాతామనవడు, సంసారం సాగరం, తూర్పు పడమర, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, తరంగిణి వంటి సూపర్‌హిట్ సినిమాలు ఆయన నిర్మించారు. ఆయన నిర్మించిన 27 సినిమాల్లో 25 సినిమాలు సూపర్‌హిట్ కావడం నిర్మాతగా ఆయన స్థాయిని తెలుపుతుంది.
తాతామనవడుతో దాసరి నారాయణరావును, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో కోడి రామకృష్ణను దర్శకులుగా పరిచయం చేసిన ఘనత రాఘవ సొంతం. దాసరి 150 చిత్రాలకు దర్శకత్వం వహించడమే కాకుండా, నటుడిగా నిర్మాతగానే కాకుండా రాజకీయాల్లోనూ రాణించి, కేంద్రమంత్రి పదవి సైతం అలంకరించడం తెలిసిందే. అలాగే సుమన్, గొల్లపూడి మారుతీరావు, బాబూ మోహన్, మాధవి, శ్యామలగౌరి వంటి నటీనటులను పరిశ్రమకు పరిచయం చేసింది కూడా రాఘవ కావడం విశేషం. రాఘవ మరణం పట్ల పరిశ్రమల ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.













