నటి గీతాంజలి ఇక లేరు
అలనాటి నటీ మణి గీతాంజలి (72) హైదరాబాద్లో కన్ను మూశారు. బుధవారం అర్ధరాత్రి ఆమెకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. పలుచిత్రాల్లో హాస్య నటిగా మెప్పించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. ఆమె స్వస్థలం కాకినాడ. భర్త దివంగత తెలుగు నటుడు రామకృష్ణ, కుమారుడు శ్రీనివాస్ సైతం నటుడే. గీతాంజలి రాణీ రత్నప్రభలో నృత్యకళాకారిణిగా తొలిసారి వెండి తెరపై కనపించారు. సీతారామ కళ్యాణం లో సీత పాత్రలో నటించి మెప్పించారు. దేవత, సంబరాల రాంబాబు, పంతాలు పట్టింపులు, ఇల్లాలు, శ్రీకృష్ణాపాండవీయం, పొట్టి ప్లీడరు, తోడు నీడ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్, సినీ నటుడు బాలకృష్ణ ప్రభృతులు సంతాపం ప్రకటించారు.













