ప్రముఖ బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూత
అలనాటి ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత శశికపూర్ (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. శశికపూర్ మృతిపట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. బాలీవుడ్‌కు చెందిన కపూర్ల కుటుంబంలో శశికపూర్ సభ్యుడు. ఆయన 1938 మార్చి 18న కలకత్తా(కోల్‌కతా)లో జన్మించారు. పృథ్వీరాజ్‌కపూర్ మూడో కుమారుడు శశికపూర్. రాజ్‌కపూర్, షమ్మీ కపూర్లకు సోదరుడు. బ్రిటన్‌కు చెందిన జెన్నిఫర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం, కరణ్ కపూర్, కునాల్ కపూర్, సంజనా కపూర్లు. చిత్ర పరిశ్రమకు శశికపూర్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా శశికపూర్ అందుకున్నారు. దివార్, కభీకభీ, సిల్సిలా, అవారా, సత్యం శివం సుందరం, నమక్ హలాల్, కాలపత్తర్, రోటి కప్డా ఔర్ మకాన్ లాంటి హిట్ సినిమాల్లో శశికపూర్ నటించి విశేష ఆదరణ పొందారు.













