మయూరి ‘సుధా’ ఇంట విషాదం : అనారోగ్యంతో తండ్రి కె. డి.చంద్రన్ మృతి

సినీ పరిశ్రమలో ఈ మధ్య వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నారు. ఇండస్ట్రికి చెందిన ప్రముఖలు, లేదా కొందరు సెలబ్రిటీల కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నటి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు ప్రేక్షకులకు ‘మయూరి’ సుధా అనగానే స్ఫురణకు వచ్చే నటి. ఓ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆమె, పట్టు వదలకుండా జై పూర్ కృతిమ కాలుతో తనకు ఇష్టమైన డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి భారత్‌లో పాటు విదేశాల్లోనూ భరతనాట్యం ప్రదర్శనలు ఇచ్చి, ఎన్నో ప్రశంశలందుకుంది. ఉషా కిరణ్ వారి మయూరి చిత్రం తో ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఆ తర్వాత తెలుగుతో పాటు కన్నడ మలయాళ, బెంగాలీ సినిమాల్లోనూ, కొన్ని సీరియల్స్‌లోనూ నటించింది. ప్రస్తుతం జీ తెలుగు వారి నెం.1కోడలు సీరియల్ లో నటిస్తోంది. అయితే సుధా చంద్రన్ ఇంట్లో తాజాగా విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి K.D.చంద్రన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న K.D. చంద్రన్ (84) ఈ నెల 12వ తేదీన ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం విషమించడంతో, ఆయన సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
K.D. చంద్రన్ నటుడిగా కూడా మంచి గుర్తింపు సంపాదించారు. హమ్ హై రహీ ప్యార్ కే’, ‘చైనా గేట్’, ‘తేరే మేరే సప్నే’, ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’, ‘కోయీ మిల్ గయా’ తదితర చిత్రాల్లో ఆయన నటించారు. అంతేకాదు, ‘గుల్మొహర్’ టీవీ షో ద్వారా కూడా ప్రేక్షకులను అలరించారు. తన తండ్రి మరణ వార్తని సుధా చంద్రన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన తండ్రి గురించి ఆమె భావోద్వేగంతో ఓ పోస్ట్ చేపట్టారు. ‘మీ కూతురుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది నాన్నా’ ఆని ఆమె అన్నారు. K.D. చంద్రన్ నేర్పించిన విలువలు, నియమాలను తాము జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని ఆమె పేర్కొన్నారు. K.D. చంద్రన్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.