గబ్బర్ సింగ్ మ్యాజిక్ రిపీట్ చేసిన వేణు శ్రీరామ్..
‘ఓ మై ఫ్రెండ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వేణు శ్రీరామ్.. ‘ఎంసీఏ’ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఈ క్రమంలో మూడో సినిమాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం దక్కించుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. అయితే నిజానికి పవన్ తో ‘వకీల్ సాబ్’ స్టార్ట్ చేసిన దగ్గర నుండి వేణు శ్రీరామ్ కి అభిమానుల నుండి ఎక్కువగా స్పందన లభించలేదు. దీనికి కారణం లేకపోలేదు, దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్కసారే నాలుగు సినిమాలు ప్రకటించటం అందులో క్రిష్, హరీష్ శంకర్ లాంటి దర్శకులు సైతం ఉండటమే. గతంలో దబాంగ్ సినిమాకి రీమేక్ గా గబ్బర్ సింగ్ తీసి పవన్ కళ్యాణ్ అభిమానుల్ని ఉర్రూతలూగించిన హరీష్ శంకర్ తో మొదటి సినిమా అయితే బాగుండేది అని నెట్టింట్లో రచ్చ చేశారు.
వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల నుండి ఇండస్ట్రీలో వేణు శ్రీరామ్ పేరు హాట్ టాపిక్ గా మారింది. పింక్ రీమేక్ మళ్లీ నాన్ కమర్షియల్ దర్శకుడు అని అప్పటి వరకు ఏమోలే అన్నట్లు సాగదీసిన పవన్ అభిమానుల్లో వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ తో ఒక్కసారిగా నూతనోత్సాహం పెంచారు వేణు శ్రీరామ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పింక్ కథను వకీల్ సాబ్ గా రీమేక్ చేసిన వేణు బాక్సాఫీస్ వద్ద తన జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బూకింగ్స్, బ్లాక్ బస్టర్ టాక్ తో సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని సినిమాల్లో ‘గబ్బర్ సింగ్’ ఒకటి. ఈ సినిమా మొదలైనపుడు పెద్దగా అంచనాల్లేవు. పదేళ్ల కిందట వరుస ప్లాపులతో డీలా పడ్డ పవన్ కళ్యాణ్ కి దర్శకుడు హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ విజయం అందించి అభిమానుల్లో జోష్ నింపాడు. అదే తరహాలో, ఇప్పుడు ‘వకీల్ సాబ్’ చిత్రంతో డైరెక్టర్ వేణు శ్రీరామ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ఆయన అభిమానులు ఏది కోరుకుంటారో అది ఉండేలా జాగ్రత్త పడి తీయటంతో మరోసారి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. హైదరాబాద్ లో అభిమానులు ఏర్పాటు చేసిన స్పెషల్ షోకి వెళ్లిన వేణు శ్రీరామ్ కి దక్కిన ఆదరణ అంతా ఇంతా కాదు. పవన్ కోసం ఒక ఫ్లాష్ బ్యాక్ సహా హీరో ఎలివేషన్ సీన్లు చాలానే రాశాడు వేణు. ఇంటర్వెల్ సమయంలో అతణ్ని అభిమానులు ముంచెత్తారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఓ రేంజిలో ఉండటం, అభిమానులకు గూస్ బంప్స్ ఇవ్వడంతో ఇంటర్వల్ కార్డ్ పడగానే థియేటర్ దద్దరిల్లిపోయింది.













