చిన్నోడితో కాంపిటీషన్.. పెద్దోడి రిప్లై ఇదే!
టాలీవుడ్ లో ఈ సంక్రాంతి చాలా రసవత్తరంగా ఉండబోతుంది. ఎంతో క్రేజీ సీజన్ అయిన ఈ సంక్రాంతి కోసం చాలా సినిమాలు లైన్లో ఉన్నాయి. ఏ సినిమాకు ఆ సినిమానే సంక్రాంతికి రావడం పక్కా అని చెప్తుంది. ఎంత సంక్రాంతి సీజన్ అయినా సరే మూడుకు మించి ఎక్కువ సినిమాలు చేస్తే థియేటర్లు దొరక్క కష్టమవడం ఖాయం.
సంక్రాంతికి ఇప్పటికే చాలా సినిమాలు షెడ్యూల్ అయి ఉండగా, వాటన్నింటిలో ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమా అంటే గుంటూరు కారం. తర్వాత ఈగల్, సైంధవ్, హనుమాన్, నా సామిరంగ, ఫ్యామిలీ స్టార్ సినిమాలు సంక్రాంతి లైన్లో ఉన్నాయి. అయితే వీటన్నింటిలో ఎన్ని సినిమాలు రిలీజ్ నాటికి రేసులో ఉంటాయనేది చూడాలి.
ఇక అసలు విషయానికొస్తే, గతంలో మహేష్, వెంకీ కాంబోలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సంక్రాంతికి రిలీజ్ అయింది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి సంక్రాంతికి పోటీ పడబోతున్నారు. దీన్ని మీరెలా భావిస్తున్నారనే ప్రశ్న సైంధవ్ టీజర్ లాంచ్‌లో వెంకీకు ఎదురైంది. దానికి వెంకీ, “పెద్దోడొస్తే సూపర్‌హిట్, చిన్నోడొస్తే సూపర్ హిట్. మా ఇద్దరి సినిమాలు ఒకేసారి వస్తున్నాయంటే చాలా ఆనందంగా ఉంది. ఆడియన్స్ మా ఇద్దరి సినిమాలను ఎలా ఆదరిస్తారో చూడాలని, దాని కోసం నేను కూడా ఎంతో ఎదురుచూస్తున్నానని” సమాధానమిచ్చాడు. వెంకీ నటించిన సైంధవ్ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.













