మరో మల్టీస్టారర్ చేసేందుకు రెడీ అవుతున్న వెంకీమామ
తెలుగు సినిమాల్లో మల్టీస్టారర్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. పాతతరంలో ఎన్టీఆర్, ఎఎన్నార్, ఆ తర్వాత కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు… చాలా మంది హీరోలు మల్టీస్టారర్స్‌లో నటించి మెప్పించారు. అయితే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి హీరోలు టాలీవుడ్‌కి పరిచయమైన తర్వాత మల్టీస్టారర్స్ అనే మాట వినిపించ లేదు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వెంకటేశ్, మహేష్ హీరోలుగా రూపొందిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో టాలీవుడ్లో మళ్లీ మల్టీస్టారర్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘనత వెంకటేశ్‌కే దక్కుతుంది.
ఈమధ్యకాలంలో ఎక్కువ మల్టీస్టారర్స్ చేసింది కూడా వెంకటేశే. పవన్‌కల్యాణ్‌తో గోపాల గోపాల, రామ్‌తో మసాల, వరుణ్‌తేజ్‌తో ఎఫ్2, నాగచైతన్యతో వెంకీమామ చిత్రాల్లో నటించి యంగ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఆమధ్య నాగచైతన్య హీరోగా రూపొందిన ప్రేమమ్ చిత్రంలో కూడా డిసిపి రామచంద్రగా ఓ గెస్ట్ రోల్లో మెరిసాడు వెంకటేశ్. మల్టీస్టారర్స్‌లో నటించడానికి తాను ఎప్పుడూ సిద్ధమే అని చెబుతూ ఉండేవారు వెంకటేశ్. దానికి తగ్గట్టుగానే ఏ హీరోతోనైనా నటించేందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
మల్టీస్టారర్స్‌కి మళ్లీ ఊపు తీసుకొచ్చిన వెంకటేశ్‌ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మంది యంగ్ హీరోలు కలిసి నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో మల్టీస్టారర్‌లో నటించేందుకు వెంకటేష్ రెడీ అవుతున్నాడు. నాగచైతన్యతో కలిసి మరో సినిమా చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కథా చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నటించే ఇతర తారాగణం ఎవరు, దర్శకుడు ఎవరు, ఏ బేనర్లో ఈ సినిమాను రూపొందించనున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది.













