Venkaiah Naidu: విలన్ పాత్రలే హీరోలు.. పిల్లలకు ఏం చెప్పాలనుకుంటున్నారని వెంకయ్య నాయుడు ప్రశ్న
ప్రస్తుతం సినిమాల ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. తెలుగు సినిమా స్థాయి పరంగా పెరుగుతున్నప్పటికీ ఒకప్పటిలా గొప్ప సినిమాలు రావడం మాత్రం తగ్గిపోయాయి. ప్రస్తుతం వస్తున్న సినిమాలపై, వాటి కథలపై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Venkaiah Naidu) రీసెంట్ గా ఓ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ రోజుల్లో విలన్ లక్షణాలున్న పాత్రలను హీరోలుగా చూపించడం ట్రెండైపోయిందని, అలాంటి సినిమాలు చూసి పిల్లలు ఏం నేర్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. సంతోషాన్ని, మంచి వినోదాన్ని అందించడమే సినిమాకు లక్ష్యం కావాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. రైటర్లు కథలు రాసేటప్పుడు కొన్ని రూల్స్ పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు.
అనవసరమైన అశ్లీలత, డబుల్ మీనింగ్ డైలాగులు రాయాల్సిన అవసరం లేదని, ఎలాంటి సన్నివేశాలనైనా అర్థం ఉండేలా రాస్తే చాలని ఆయన తెలిపారు. అప్పట్లో వచ్చిన సినిమాలన్నీ ఎంతో వినోదాన్ని అందించేవని, ఇప్పటికీ ఆ సినిమాల గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంటే దానికి కారణం అందులో ఎలాంటి అశ్లీలత లేకపోవడమేనని ఆయన తెలిపారు. విలన్ పాత్రలనే హీరోలుగా చూపించడం హీరోయిజం అనిపించుకోదని, కథల విషయంలో మంచి ప్రమాణాలు పాటించాల్సిన అవసరముందని, వినోదం కోసం బూతులు వాడనక్కర్లేదని, పాత సినిమాలే దానికి నిదర్శనమని ఆయన తెలిపారు.













