అరుదైన రికార్డు సాధించిన బాలయ్య
ఓటీటీలు లేని రోజుల్లో సినిమాలు వంద రోజులు, రెండు వందల రోజులు థియేటర్లలో ఆడేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎంత పెద్ద సినిమా అయినా లాంగ్ రన్ అంటే మహా అయితే 50 రోజులు అంతే. తర్వాత సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. థియేటర్ల నుంచి ఆయా సినిమాలను తీసేసి కొత్త సినిమాలను తీసుకుంటారు.
ఇలాంటి క్రమంలో బాలయ్య ఓ అరుదైన మైలురాయిని సాధ్యం చేసుకున్నాడు. సంక్రాంతికి రిలీజ్ అయిన వీరసింహారెడ్డి సినిమా బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కర్నూలు జిల్లా ఆలూరు పట్టణం శ్రీ లక్ష్మి నరసింహా థియేటర్లో రోజూ 4 ఆటలతో 175 రోజులు దాటేసింది.
అంతే కాదు, వరుసగా డబుల్ యాక్షన్ చేసిన ఒక హీరో రెండు సినిమాలు సిల్వర్ జూబ్లీ చేసుకోవడం ఇదే మొదటి సారి. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరూ, కృష్ణ లాంటి హీరోల సినిమాలు 175 రోజులు చాలానే ఆడాయి కానీ బ్యాక్ టు బ్యాక్ ద్విపాత్రాభినయాలు చేసిన సినిమా ఆడటం మాత్రం ఇండియన్ సినిమాలో ఇదే మొదటిసారని ఫ్యాన్స్ చెప్తున్నారు. కాగా ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.













