ఫ్యాన్స్ అంచనాలను గోపీచంద్ అందుకుంటాడా?
అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ చేస్తున్న కమర్షియల్ సినిమా వీరసింహా రెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పాటలు, పోస్టర్లు, గ్లింప్స్ సినిమాకు మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. 6వ తేదీ ఒంగోలు లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో ట్రైలర్ కూడా రిలీజ్ కానుంది.
ఈ సినిమా విషయంలో అందరికీ గోపీచంద్ మీద సందేహాలున్నాయి. బాలయ్యతో ఫస్ట్ టైమ్ సినిమా చేస్తున్న గోపీచంద్ బాలయ్యను ఎలా డీల్ చేశాడు? ఆయన నుంచి ఎలాంటి యాక్షన్ రాబట్టుకున్నాడు? అనే అనుమానాలు అభిమానుల్ని భయపెడుతున్నాయి. కంటెంట్‌తో సంబంధం లేకుండా బాలయ్యను, అతడి రేంజ్‌ను, ఆయన యాక్షన్‌ను వాడుకుని మూడు బ్లాక్ బస్టర్లు కొట్టాడు బోయపాటి.
బాలయ్యతో హిట్ కొట్టాలంటే బోయపాటే అనేంతగా పేరు తెచ్చుకున్నాడు బోయపాటి. మరి బోయపాటిలానే గోపీచంద్ కూడా బాలయ్యను అంతే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేశాడా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. స్వతహాగా బాలయ్యకు వీరాభిమాని అయిన గోపీచంద్, తన అభిమాన హీరో ఎలా ఉండాలో, అంతకు మించి బాలయ్యను సినిమాలో చూపించాడని, సినిమా చూశాక అందరూ గోపీచంద్‌ను మెచ్చుకుంటారని సన్నిహిత వర్గాల సమాచారం.
ఇప్పటికే టీజర్లో మాస్ గెటప్, యాక్షన్ చూస్తే బాలయ్యతో గోపీచంద్ పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టడానికి ముహూర్తం పెట్టుకున్నట్లే కనిపిస్తుంది. పైగా గోపీచంద్ లేటెస్ట్ మూవీ క్రాక్ పెద్ద హిట్టయిన విషయం తెలిసిందే. బాలయ్య రీసెంట్ ఫిల్మ్ అఖండ, గోపీ రీసెంట్ ఫిల్మ్ క్రాక్ కూడా హిట్ అవడం, దానికి తోడు సంక్రాంతి సీజన్ కావడంతో సినిమాకు ఓపెనింగ్స్ భారీగానే వస్తాయి. మరి గోపీచంద్ బాలయ్యతో ఎలాంటి సినిమా తీశాడు? ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడు అనేది తెలియాలంటే జనవరి 12 వరకు ఆగాల్సిందే.













