బజ్ ఎక్కడ అర్జునా?
మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్నా ఇప్పటికీ బజ్ రాకపోవడం అంటే అది సినిమా ఓపెనింగ్స్ మీద ఎంతటి ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున ఈ నెల 25న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కోసం వరుణ్ చాలానే కష్టపడ్డాడు. ఎంతో కష్టపడి దేశ విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ స్పై థ్రిల్లర్ కి రిలీజ్ దగ్గర పడినప్పటికీ కావాల్సిన రేంజ్ లో బజ్ అయితే రాలేదు. హీరో, హీరోయిన్ ఇలా ఎవరికి వారు ఇంటర్వూలు ఇచ్చి సినిమాను ప్రమోట్ చేస్తున్నప్పటికీ జనాల్లోకి అయితే ఈ సినిమా పెద్దగా వెళ్ళడం లేదనేది వాస్తవం. లో బజ్ తో సినిమా రిలీజ్ అయితే దాని ప్రభావం కలెక్షన్ల మీద గట్టిగా ఉంటుంది.
పైగా ఇది సోలో రిలీజ్ కూడా కాదు. ఈ సినిమాకు ఒక రోజు ముందు దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కొత్త మూవీ వస్తుంది. టాక్ ఏ మాత్రం పాజిటివ్ గా ఉన్నా ఈ మాస్ మూవీకు జనాలు బ్రహ్మరథం పట్టడం ఖాయం. దీంతో పాటూ కార్తికేయ బెదురులంక కూడా రిలీజ్ అవుతుంది. ట్రైలర్ చూస్తుంటే ఎంటర్టైన్మెంట్ వైబ్స్ పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ట్రైలర్ లో చూపించినట్లు సినిమాలో కూడా కామెడీ వర్కవుట్ అయితే సినిమా హిట్ అవడం పక్కా. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అయినా వరుణ్ తేజ్ ఈ సినిమా ప్రమోషన్స్ ను స్పీడప్ చేయాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఏమైనా బజ్ పెరుగుతుందేమో అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ తన కెరీర్ కు చాలా కీలకం కావడంతో తన ఆశలన్నీ గాండీవధారి అర్జున మీదే పెట్టుకున్నాడు వరుణ్.













