బన్నీ ఆట కట్టించనున్న జయమ్మ
వరలక్ష్మీ శరత్ కుమార్. ప్రస్తుతం తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో పరిచయం అక్కర్లేని పేరు. మొదట్లో తమిళ సినిమాల్లో తన విలనిజాన్ని చూపించిన వరలక్ష్మీ… ఆ తర్వాత టాలీవుడ్ లో పవర్ ఫుల్ విలన్ గా పేరు తెచ్చుకుంది. విశాలమైన కళ్లతో ఆమె పలికించే అభినయానికి చాలా మంది ఫిదా అయ్యారు.
తెనాలి రామకృష్ణ బీఏబీఎల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ అమ్మడు క్రాక్ సినిమాతో జయమ్మగా అందరినీ ఆకట్టుకుంది. తర్వాత వచ్చిన నాంది కూడా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. యేడాది మొదట్లోనే రెండు విజయాలను అందుకున్న వరలక్ష్మికి తెలుగు లో మంచి ఆఫర్లు వచ్చిన విషయం తెలసిందే. అందులో ఒక బంపరాఫర్ ఈ అమ్మడుని వరించింది. కొరటాల డైరక్షన్ లో బన్నీ హీరోగా తెరకెక్కే సినిమానే.
చిరంజీవి హీరోగా ఆచార్య తెరకెక్కిస్తున్న కొరటాల ఆ తర్వాత బన్నీ తో సినిమా చేయనున్నాడు. ఇటు బన్నీకూడా సుకుమార్ డైరక్షన్ లో పుష్ప చేస్తున్నాడు. ఆగస్టు 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత బన్నీ, కొరటాల సినిమా పట్టాలెక్కనుంది. పొలిటికల్ టచ్ తో స్టూడెంట్ లీడర్ క్యారెక్టర్ చేయనున్న బన్నీ ఆట కట్టించే విలన్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనుందని సమాచారం. మొత్తానికి ఈ అమ్మడు పోయి పోయి బన్నీతోనే పెట్టుకుందన్నమాట.













