మెగా మేనల్లుడికి ఆఫర్ల ఉప్పెన
ఇటీవల కాలంలో కలెక్షన్స్ తో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఉప్పెన యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఒక స్టార్ హీరో రాబట్టే కలెక్షన్స్, ఒక డెబ్యూ హీరో రాబట్టడం కేవలం తెలుగు సినీ పరిశ్రమనే కాదు, ఇతర ఇండస్ట్రీలను కూడా ఆశ్చర్యపరిచింది. జాలరిగా వైష్ణవ్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా కూడా వైష్ణవ్ కి మంచి ఫ్యూచర్ ఉందని జోస్యం చెప్పేశారు.
ఇప్పటికే వైష్ణవ్ తేజ్, క్రిష్ డైరక్షన్ లో ఒక సినిమా చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఆ తర్వాత అన్నపూర్ణ బ్యానర్ లో ఒకటి, షైన్ స్క్రీన్ బ్యానర్ లో ఒక సినిమా చేయడానికి వైష్ణవ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఉప్పెన కలెక్షన్స్ చూసిన ఇతర నిర్మాతలు ఈ హీరోపై 15 కోట్ల వరకు పెట్టుబడి పెట్టొచ్చనే డెసిషన్ కు వచ్చేశారు. దీంతో యువ దర్శకులు కొంతమంది ఆ స్థాయి బడ్జెట్ కు తగిన కథలను రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే వెంకీ కుడుమల, వెంకీ అట్లూరి లు రీసెంట్ గా వైష్ణవ్ కు ఇప్పటికే కథలు కూడా వినిపించారని, వీరితో పాటు చందూ మొండేటి కూడా వైష్ణవ్ ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్తున్నారు. శివ నిర్వాణ, వివేక ఆత్రేయ కూడా ముందుగా తమ కథలను చెప్పి ఓకే అనిపించుకుంటే ఆ తర్వాత తమ సీరియల్ నెంబర్ వచ్చినప్పుడు రంగంలోకి దిగొచ్చనే ముందుచూపుతో ఉన్నారట. ఎలాగైతేనేం వైష్ణవ్ తేజ్ కు ఆఫర్ల ఉప్పెన మామలుగా లేదు.













