ఆ సినిమాకు పోస్ట్‌పోన్ తప్ప మరో దారి లేదు..
మొదటి సినిమా ఉప్పెనతోనే సంచలన విజయం అందుకున్న వైష్ణవ్ తేజ్ కు ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండలేదు. తన తర్వాతి సినిమాలు కొండపొలం, రంగ రంగ వైభవంగా రెండూ డిజాస్టర్లుగా మిగలడంతో వైష్ణవ్‌కు నిరాశే మిగిలింది. ఈ నేపథ్యంలో వైష్ణవ్ తేజ్ తన తర్వాతి సినిమా ఆదికేశవ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.
వాస్తవంగా ఈ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ కావాల్సింది. కానీ ఇప్పుడు ఆదికేశవ పోస్ట్‌పోన్ అవడం తప్పించి మరో దారి కనిపించడం లేదు. దీనికి మొదటి కారణం భోళా శంకర్ సినిమాకు,ఈ సినిమా రిలీజ్ డేట్‌కు కేవలం వారం రోజులు మాత్రమే గ్యాప్ ఉండటం. ఎంత కంటెంట్ ఉన్నా సరే మెగాస్టార్ సినిమా థియేటర్లలో ఉండగా తన సినిమాను రిలీజ్ చేసే ధైర్యం చేయడు వైష్ణవ్.
దానికి తోడు జైలర్ కూడా ఆగస్ట్ 10న రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత కారణం, వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున సినిమా ఆగస్ట్ 25న రిలీజ్ కానుండటం. అంటే ఆదికేశవకు, వరుణ్ సినిమాకు కూడా గ్యాప్ ఒక వారమే. ఇలాంటి నేపథ్యంలో తమ సినిమాను రిలీజ్ చేయడం రిస్క్ ఎందుకు అనుకున్న వైష్ణవ్ ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నాడట.
దానికితోడు ఆదికేశవకు ఇప్పటి వరకు ఇంకా బజ్ రాలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ ను ఇంకా మొదలుపెట్టలేదు మేకర్స్. సినిమా నుంచి ఇప్పటివరకు బయటకు వచ్చింది కేవలం టీజర్ మాత్రమే. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఓ గుడి చూట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ గా తెలుస్తోంది. దీంతో ప్రమోషన్లను సరిగా ప్లాన్ చేసుకుని మంచి రిలీజ్ డేట్ చూసుకుందామనుకుని నాగవంశీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













