బాలీవుడ్ నుంచి ఊర్వశి రౌటేలా
గోపీచంద్ కోసం ప్రత్యేకంగా బాలీవుడ్ నుంచి ఓ అందం వస్తోంది. సంపత్ నంది దర్శకత్వంలో గోపీ కథానాయకుడిగా సీటీమార్ తెరకెక్కుతోంది. తమన్నా నాయిక. క్రీడా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉండనుంది. అందులో ఆడిపాడేందుకు బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా ఎంపికైంది. బాలీవుడ్లో పలు చిత్రాలు చేసి తన అందంతో కుర్రాళ్ల మనసు దోచింది ఊర్వశి. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ ఓ ప్రత్యేక గీతం ఉన్నట్టు సమాచారం. అందులో కూడా ఓ ప్రముఖ కథనాయిక ఆడిపాడనుందని తెలుస్తోంది. మొత్తంగా ఈ ఏడాది తెలుగు తెర ప్రత్యేక మెరుపులతో ప్రేక్షకుల్ని మురిపించనుంది.













