థియేటర్స్ ఓపెన్ కాబోతున్నా.. ఓటీటీకే వెళుతున్న ‘ఉప్పెన`?
టాలీవుడ్లో ఎన్నో సినిమాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నాయి. వాటిని థియేటర్స్‌లో రిలీజ్ చెయ్యాలా, ఓటీటీ ద్వారా రిలీజ్ చెయ్యాలా అని చాలా మంది నిర్మాతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లలో విడుదల చేస్తే వస్తే నష్టమేమిటి? ఓటీటీలో రిలీజ్ చేస్తే కలిగే లాభమేమిటి? అనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజ్ అయిపోయాయి. అయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన ఏ సినిమాకూ పాజిటివ్ టాక్ రాకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోని థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు ఓపెన్ చేసుకోవచ్చు అని కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. దాని ప్రకారమే థియేటర్లు ఓపెన్ చేసేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్ళూ థియేటర్స్ ఓపెన్ అయితే చాలు అని ఎదురుచూసిన నిర్మాతలు మరోసారి ఆలోచనలో పడుతున్నారు. కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడం వల్ల థియేటర్లు ఓపెన్ చేసినా ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారా? అనే సందేహం వారిలో ఉంది. అందుకే థియేటర్ల కంటే ఓటీటీ బెటర్ అనుకుంటున్నారు నిర్మాతలు.
సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్‌తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం `ఉప్పెన`. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అయి చాలా కాలం అయింది. ఏప్రిల్‌లోనే ఈ సినిమాను విడుదల చేద్దామని నిర్మాతలు ప్లాన్ చేశారు. మార్చి నెలాఖరులోనే లాక్డౌన్ మొదలవడంతో రిలీజ్ ఆగిపోయింది. ఇప్పటికే ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ సినిమాను ఓటీటీ రిలీజ్ చేస్తారని ఆమధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని, తాము థియేటర్స్‌లోనే సినిమాను రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. ఇప్పుడు థియేటర్స్‌కి అనుమతి లభించడంతో ఈ సినిమా థియేటర్లోనే విడుదలవుతుందని అందరూ భావించారు.
కానీ, దానికి విరుద్ధంగా ఈ సినిమాను ఓటీటీ ద్వారానే రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు అనుకుంటున్నారని తెలుస్తోంది. ఎందుకంటే జనం థియేటర్‌కి రారన్న భయం ఒకటి కాగా, సినిమాను తక్కువ రేటుకి బయ్యర్లు ఎగ్జిబిటర్లు అడగడం ఒక కారణం. దీన్ని దృష్టిలో ఉంచుకొని పే ఫర్ వ్యూ పద్ధతిలో సినిమాను రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారట. ఇప్పటికే అమెజాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఇది ఫైనల్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.













