హీరోకి ధీటుగా ఉండే పవర్ ఫుల్ క్యారెక్టర్లో విలక్షణ నటుడు ఉపేంద్ర
దర్శకుడిగా, హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉన్న ఉపేంద్ర కెరీర్ ప్రారంభంలో తను చేసిన సినిమాలు విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. హీరోలు ఇలాంటి సినిమాలు కూడా చేస్తారా అందరూ ఆశ్చర్యపోయే విధమైన సినిమాలు చేసి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఎ, ఉపేంద్ర వంటి సినిమాలు హీరోగా అతనికి స్పెషల్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర ఆమధ్య తెలుగులో కూడా కొన్ని సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో భయానకమైన విలన్‌గా అందర్నీ అలరించాడు. ఈమధ్య అతనికి సినిమాల్లో అవకాశాలు తగ్గినప్పటికీ అతని క్రేజ్ మాత్రం తగ్గలేదు. అందుకే కొన్ని సినిమాల్లో ఆయన కోసమే క్రియేట్ చేసిన కొన్ని సినిమాల్లో ఆయన్ని నటింపజేసేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆయన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించాడు.
తాజాగా వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఉపేంద్ర ఓ కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో ఉపేంద్ర నటించబోతున్నాడు. ఈ విషయాన్ని వరుణ్‌తేజ్ స్వయంగా ప్రకటించాడు. సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత తెలుగులో చాలా అవకాశాలు వచ్చినప్పటికీ ఉపేంద్ర ఏ సినిమాను కమిట్ అవ్వలేదు. ఎందుకంటే ఆయన ఇమేజ్‌కి తగ్గ క్యారెక్టర్స్ వచ్చే వరకు ఆగాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా లాక్డౌన్ కారణంగా ఆగిపోయింది.
త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్లీ ఇంతకాలానికి తెలుగులో సినిమా చేయడానికి ఉపేంద్ర ఒప్పుకున్నారంటే అది ఖచ్చితంగా అద్భుతమైన క్యారెక్టర్ అయి ఉంటుంది. హీరోకి ధీటుగా ఉండే ఈ క్యారెక్టర్ ఉపేంద్ర మాత్రమే చేయగలడని దర్శకుడు భావించాడట. అందుకే ఈ సినిమా కోసం ఉపేంద్రను సంప్రదించారు. దీంతో ఈ సినిమాకి ఒక స్పెషల్ క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటేందుకు ఉపేంద్ర సిద్ధమవుతున్నారన్నమాట.













