తెరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న వారసులు.. అడ్డుకట్ట వేసిన కరోనా!
సినిమా రంగంలో స్వయంకృషితో రాణించాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎలాంటి సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకుండా కేవలం స్వయంకృషితోనే అంచెలంచెలుగా ఎదిగి టాప్‌స్టార్‌గా నిలబడ్డ వారిలో మొదట చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి గురించి. అలా కష్టపడి పైకొచ్చిన వారు ఈ తరంలో ఎవ్వరూ లేరనే చెప్పాలి. కేవలం వారసత్వంతో, సినిమా బ్యాక్‌గ్రౌండ్‌తో అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. అలా ఇప్పటివరకు టాలీవుడ్లో ఓ పాతిక మంది హీరోలు ఎంట్రీ ఇచ్చి ఉంటారు. అయితే వారిలో సక్సెస్ అయినవారు ఉన్నారు. ఒకటి, రెండు సినిమాలతో తెరమరుగైపోయిన వారూ ఉన్నారు. తాజాగా మరికొంతమంది వారసులు సిల్వర్ స్క్రీన్‌పై తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే వారికి కరోనా అడ్డుకట్ట వేసింది. మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు.
తాజాగా సాయిధరమ్‌తేజ్ సోదరుడు వైష్ణవ్‌తేజ్ `ఉప్పెన` చిత్రంతో రంగంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నాడు. సినిమా పూర్తయిపోయి రిలీజ్‌కి రెడీ అనే టైమ్‌లోనే లాక్డౌన్ స్టార్ట్ అవడం, థియేటర్లు మూత పడడంతో రిలీజ్ ఆగిపోయింది. ఈ సినిమాలోని సాంగ్స్ ఆల్రెడీ పెద్ద హిట్ అయ్యాయి. ఫస్ట్‌లుక్, పబ్లిసిటీ చూస్తే సినిమాలో ఎంతో కొంత విషయం ఉంది అనిపించింది. కానీ, కరోనా దానికి అడ్డుకట్ట వేసింది. అలాగే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తమ్ముడు సాయి గణేష్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. పవన్ సాదినేని డైరక్షన్లో సినిమా స్టార్ట్ అయి చాలా కాలం అయింది. ఈ సినిమాకు సంబంధించి కరోనాకు ముందు కూడా ఎలాంటి అప్ డేట్ లేదు. కరోనా టైమ్ లో సరేసరి. మరో కొత్త హీరో నిర్మాత డివివి దానయ్య కుమారుడు. టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇవ్వాలని ఎప్పటి నుంచో ఉవ్విళ్ళూరుతున్నాడు.
మంచి సబ్జెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. మారుతి చేతుల మీదుగా కుమారుడ్ని హీరోగా పరిచయం చెయ్యాలనుకున్నాడు దానయ్య. కానీ, అది వర్కవుట్ అవ్వకపోవడంతో శ్రీవాస్ దర్శకత్వంలో మంచి హిలేరియస్ సబ్జెక్ట్‌తో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలుపెట్టారు. సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలోనే లాక్డౌన్ వచ్చిపడింది. ఇక మరో నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి తొలి సినిమాతో హీరోగా ఫర్వాలేదు అనిపించుకున్నాడు. మరో రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఒక సినిమా దాదాపు పూర్తయింది. ఈ సినిమాను కూడా వెంటనే రిలీజ్ చేసేసి మూడో సినిమా మొదలుపెడదాం అనుకునేలోపే థియేటర్లు మూతపడ్డాయి, షూటింగులు నిలిచిపోయాయి.
మరి ఈ వారసుల ఎదురుచూపులు ఎప్పుడు ఫలిస్తాయో, కరోనా వెనక్కి తిరిగి చూడకుండా ఎప్పుడు మటుమాయం అవుతుందో, మళ్లీ సాధారణ పరస్థితులు ఎప్పుడు నెలకొంటాయోనని ఎదురుచూడడం తప్ప ఎవ్వరూ ఏమీ చేయలేరు.













