కేంద్ర మంత్రి అనురాగ్ తో చిరంజీవి, నాగార్జున భేటీ
కేంద్ర సమాచార, ప్రసార, యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ను టాలీవుడ్ హీరోలు చిరంజీవి, అక్కినేని నాగార్జున కలిశారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అనురాగ్ ఠాకూర్‌ను చిరంజీవి తన ఇంటికి ఆహ్వానించారు. దీంతో కేంద్ర మంత్రి ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు హీరోలు అనురాగ్ ఠాకూర్‌ను శాలువాతో సత్కరించారు. అనంతరం ఆయనకు గణేశుడి విగ్రహాన్ని బహుకరించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు విషయాలపై చర్చించారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా మీరు మమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. భారతీయ సినీ పరిశ్రమ గురించి అది సాధిస్తోన్న పురోగతి గురించి నా సోదరుడు నాగార్జునతో కలిసి మీతో చర్చించడం సంతోషంగా ఉంది అంటూ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ను కలిసిన వారిలో నిర్మాత అల్లు అరవింద్ కూడా ఉన్నారు.













