యూట్యూబ్ లో ఉద్యమ సింహం
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవిత కథా చిత్రంగా ప్రచారం జరిగిన సినిమా ఉద్యమ సింహం. పద్మనాయకా ప్రొడక్షన్స్ పతాకంపై కల్వకుంట్ల నాగేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించగా.. అల్లూరి కృష్ణంరాజు దర్శకత్వం వహించారు. గత నెల 29 తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాలతో ఆగిపోయింది. ఇక ఈ చిత్రాన్ని విడుదల చేయలేమని, యూట్యూబ్లో, టీవీ ప్రదర్శనకు ఉచితంగా ఇస్తున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు. హైదారాబాద్ ఫిలింఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఇది రాజకీయ చిత్రం కాదు. తెలంగాణలో జరిగిన ఉద్యమ పోరాటాన్ని చూపించాం. కొందరు కేసీఆర్ జీవిత కథ అంటూ చెప్పారు. అందులో వాస్తవం లేదు. ఈ సినిమాను అధికార పార్టీకి ఓట్లు రాబట్టడం కోసం చేసింది కాదు. మేము షెడ్యూల్ ప్రకారం చేసుకున్న సినిమా. ఎన్నికల సమయంలో ఎక్కువ మందికి చేరుతుంది అని భావించాం. సెన్సార్ విడుదలకు అంగీకరించినా.. కొందరు మా సినిమా విడుదలకు అడ్డుపడుతున్నారు. దాంతో యూట్యూబ్ ఛానెల్స్, టీవీ ప్రసారాల కోసం ఉచితంగా మా చిత్ర హక్కులు ఇచ్చేయాలని నిర్ణయించాం అని అన్నారు.













