సీరియల్స్‌కి షాక్…సినిమాలకు బ్రేక్?
హమ్మయ్య ప్రభుత్వం అనుమతించింది. ఇక మా కష్టాలు తీరినట్టే అనుకుంటున్న చిన్ని, పెద్ద తెర నటీనటులకు, సంబంధిత వర్గాలకు ఆ ఆనందం అంతలోనే ఆవిరిపైపోనుందా? మరోసారి షూటింగ్స్‌కు బ్రేక్ పడనుందా? తెటుగు రాష్ట్రాల్లో పరిణామాలు చూస్తుంటే ఈ తరహా సందేహం కలగకమానదు. ప్రభుత్వాలు, సినీ పెద్దలు అనేక దఫాలు సమావేశమై, కూలంకుషంగా చర్చించిన తర్వాత సీరియల్స్, సినిమాల షూటింగ్స్‌కు ఇటీవలే అనుమతి లభించింది. దీంతో ఇప్పుడిప్పుడే షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసులు, మరోవైపు ఆర్ధిక సమస్యల నేపధ్యంలో షూటింగ్స్ కు అనుమతి వచ్చినా… ఒక్కసారిగా అన్నీ కీ స్టార్ట్ చేయకుండా ఒక్కటొక్కటిగా నిదానంగానే మొదలయ్యాయని చెప్పాలి.
అయితే ఆదిలోనే హంసపాదులాగా మరోసారి కరోనా కలకలం ఈ షూటింగ్స్ని చుట్టుముట్టింది. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రముఖ టీవీ చానెల్ సీరియల్ షూటింగ్లో పాల్గొన్న సీనియర్ నటుడు కరోనా బారిన పడ్డాడు. తిరుపతి నుంచి నేరుగా వచ్చి ఆ షూటింగ్లో పాల్గొన్న ఆ నటుడు కరోనా పాజిటివ్ అని తేలడంతో షూటింగ్‌ని అర్ధంతరంగా ఆపేశారు. సదరు షూటింగ్లో పాల్గొన్న సహనటీనటులు, టెక్నీషియన్స్ అందరినీ క్వారంటైన్‌కు పంపారు.
దీంతో సీరియల్స్ షూటింగ్స్ ఆగిపోయాయి. ఇదే పరిస్థితి తమిళనాడులో కూడా ఏర్పడడంతో అక్కడ ప్రభుత్వం షూటింగ్స్‌కి ఇచ్చిన అనుమతిని రద్దు చేసింది. ఇక్కడ కూడా అదే నిర్ణయం వచ్చే అవకాశః ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్స్ భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు షూటింగ్స్ జరపాలని అనుకున్నా, ఈ రకమైన పరిస్థితుల నేపధ్యంలో అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉండరనే సందేహాలు కూడా నిర్మాణ సంస్థలకు కలుగుతున్నాయి. దీంతో మరి కొన్ని నెలల దాకా షూటింగ్స్ పుంజుకునే పరిస్థితి లేకపోవచ్చని అంటున్నారు.













