టక్ జగదీష్ మొదటి మాట వినేదెప్పుడంటే..
శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ టక్ జగదీష్. ఇందులో నానికి జోడీగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ లు చేస్తున్నారు. ఏప్రిల్ 23న రిలీజ్ కానున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలకు మంచి ఆదరణ వస్తుంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను మొదలుపెట్టిన యూనిట్ పరిచయ వేడుక పేరుతో రాజమండ్రిలో రీసెంట్ గా చేసిన ఈవెంట్ కూడా మంచి సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలోనే టక్ జగదీష్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. ఉగాది రోజున అంటే ఏప్రిల్ 13న టక్ జగదీష్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ను రిలీజ్ చేస్తూ చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
ఈ ట్రైలర్ లాంఛ్ కోసం వైజాగ్ లో గ్రాండ్ గా ఈవెంట్ కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ట్రైలర్ లాంఛ్ అని చెప్తూ రిలీజ్ చేసిన పోస్టర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కళ్లకు కాటుక, చేతులకు పారాణి, నుదుటిన బొట్టు పెట్టుకుని పెళ్లి కొడుకులా రెడీ అయిన నాని, పట్టు పంచె పైకి కట్టుకుని రథం ముందు నిల్చుని ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకోవడం వినడం తప్పించి, ఈ సినిమా నుంచి ఒక్క డైలాగ్ కూడా వినింది లేదు. అంటే ఇప్పుడు ట్రైలర్ లాంఛ్ లో అంటే ఏప్రిల్ 13న మొదటి మాట వినొచ్చన్నమాట. ఇందులో నాని జగదీష్ నాయుడిగా కనిపించనుండగా, తన అన్న పాత్రను జగపతి బాబు, తండ్రి పాత్రను నాజర్ లు పోషిస్తున్నారు. థమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను టక్ జగదీష్ ఏ మేర నిలబెట్టుకుంటాడో చూడాలి.













