అట్టహాసంగా టీఎస్ఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రదానం
విశాఖపట్నంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి లలితకళాపరిషత్ జాతీయ సినీ అవార్డుల ప్రదానం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులంతా ఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొనడంతో వీక్షకులకు కనువిందు కలిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఇండస్ట్రీలోని నటులంతా స్నేహభావంతో కలిసే ఉంటున్నాం. ఈ సత్యాన్ని అభిమానుల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే తామంతా సుబ్బిరామిరెడ్డి నిర్వహిస్తున్న వేడుకలకు వస్తున్నాం, కళాకారులు, కళలను ప్రోత్సహిచేందుకు చేస్తున్న ఈ కార్యక్రమానికి మంచి మనసుతో సహకరిస్తున్నాం అని అన్నారు. రంగస్థలం చిత్రంలో ఉత్తమ నటుడిగా ఎంపికైన చరణ్‌కు వచ్చిన అవార్డును తాను స్వీకరించడం చరణ్ తండ్రిగా ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ ఒకే వేదికపై అగ్ర నటులందరినీ చేర్చడం సుబ్బిరామిరెడ్డికే సాధమన్నారు. శాతకర్ణి చిత్రాన్ని అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. అక్కినేని నాగార్జున మాట్లాడుతూ తాను ఎంతగానో ఇష్టపడే రంగస్థలం, మహానటి, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలకు అవార్డులు రావడం ఆనందంగా ఉందన్నారు.
మోహన్‌బాబు మాట్లాడుతూ 18 ఏళ్లుగా ఓటు అడగకుండా విశాఖ వాసుల సంతోషం కోసం అనేక మంచి పనులను సుబ్బిరామిరెడ్డి చేయడం గొప్ప విషయమన్నారు. తన తండ్రి లాంటి దాసరి పేరిట అవార్డును తీసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు. సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ ప్రజల సంతోషంలోనే తనకు శక్తి లభిస్తుందని, వారి సంతోషం కోసమే పదేళ్లుగా ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. సినీ ప్రముఖులు, రాజేంద్రప్రసాద్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, విద్యాబాలన్, దేవిశ్రీ ప్రసాద్, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియమణి పూజాహెగ్డే, దేవీశ్రీప్రసాద్, బోనీ కపూర్ తదితరులు పాల్గొన్నారు.













