Donald Trump: భారతీయ సినీ పరిశ్రమకు ట్రంప్ షాక్: విదేశీ సినిమాలపై 100% టారిఫ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో సంచలన నిర్ణయంతో ప్రపంచ సినిమా పరిశ్రమకు, ముఖ్యంగా భారతీయ సినిమాలకు బిగ్ షాక్ ఇచ్చారు. అమెరికాలో విడుదల కాబోయే విదేశీ సినిమాలపై ఏకంగా వంద శాతం సుంకాలు (టారిఫ్‌లు) విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మాత్రమే ఈ పన్నుల నుంచి మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. ట్రంప్ విధించిన ఈ భారీ సుంకాల ప్రభావం భారతీయ సినీ పరిశ్రమపై, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలపై తీవ్రంగా పడుతుందని సినీ వాణిజ్య విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే అమెరికా మార్కెట్ తెలుగు సినిమాలకు అత్యంత కీలకమైన ఓవర్సీస్ మార్కెట్‌గా ఉంది. ఇకపై అమెరికాలో సినిమా విడుదల చేయాలంటే, వంద శాతం అదనపు ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది.ఈ నిర్ణయం వల్ల భారతీయ నిర్మాతలు అమెరికాలో తమ చిత్రాలను విడుదల చేసే విషయంలో పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అలాగే కిచెన్ కేబినెట్ ఉత్పత్తులపై 25 శాతం, కలప దిగుమతులపై 10 శాతం సుంకాలు విధిస్తున్నట్లు కూడా ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్‌లు అక్టోబరు 14వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని ట్రూత్ సోషల్‌లో వెల్లడించారు. అదే సమయంలో అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోని దేశాలపై సుంకాలు మరింత పెరుగుతాయని ట్రంప్ (Donald Trump) హెచ్చరించారు.