ఓటీటీ లో స్టార్ హీరోయిన్ సినిమాలు
2020 లో కరోనాతో లాక్ డౌన్ అవగా, థియేటర్లు మూత పడ్డాయి. క్రమంగా ఓటీటీ లు బాగా లాభపడ్డాయి. మళ్లీ మెల్లిమెల్లిగా ఇప్పుడే పరిస్థితుల నుంచి కోలుకుని థియేటర్లు స్టార్ట్ అయ్యాయి, సినిమాలన్నీ వరుస రిలీజ్ లకు వస్తున్నాయనుకుంటున్న టైమ్ లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చూపిస్తుంది. మళ్లీ థియేటర్లు మూతపడే పరిస్థితి. చూస్తుంటే ఈ ఓటీటీలకు సాయం చేయడానికే ఈ కరోనా ఇన్ని వేవ్ లుగా వస్తున్నట్లనిపిస్తుంది.
ఓటీటీల ద్వారా ప్రజా జీవనంలో మార్పును తీసుకొచ్చేందుకు వచ్చిన వేవ్ అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే. మున్ముందు వినోద రంగంలో కొత్త పరిణామాలకు, సినిమాలు చూడటానికి డిజిటల్, ఓటీటీ ప్రాధాన్యతకు ఇదే సూచికగా కనిపిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు సినిమా హాళ్ల ఆదరణకు కొదువేం ఉండదని ప్రూవ్ అయినా సరే ఓటీటీ ల అవసరం మాత్రం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. 2020లో ఎన్నో సినిమాలు థియేటర్లు ఓపెన్ లేక ఓటీటీలోనే డైరెక్ట్ రిలీజ్ చేశారు. దీంతో ఓటీటీపైనే ఎంటర్టైన్మెంట్ రంగం ఆధారపడుందని అర్థమవుతుంది.
చూస్తుంటే గతంలో జరిగిందే ఇప్పుడు మళ్లీ రిపీట్ అయ్యేట్లు అనిపిస్తుంది. ఇప్పుడు కూడా ఎన్నో క్రేజీ సినిమాలు ఓటీటీ వైపు నడుస్తున్నాయి. ఇందులో టాప్ హీరోయిన్లు అయిన నయనతార, త్రిష ల సినిమాలు కూడా ఉన్నాయి. నయనతార ప్రస్తుతం నటిస్తున్న నెట్రికాన్ సినిమా ప్రైమ్ లో రిలీజ్ కు రెడీ అవుతుంది. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కొరియన్ మూవీ బ్లెండ్ కు అఫీషియల్ రీమేక్. ప్రతీకారం తీర్చుకునే అంధ మహిళగా నయనతార ఇందులో కనిపించనుంది. అవల్ ఫేమ్ మిలింద్ రౌ ఈ సినిమాను డెరెక్ట్ చేస్తున్నాడు. మరో హీరోయిన్ త్రిష చేసిన 60వ సినిమా పరవపాదమ్ విలయాట్టు రీసెంట్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. తన తర్వాతి సినిమా రాంగి కూడా రిలీజ్ కు రెడీ అవుతుంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా హాట్ స్టార్ లోనే రిలీజ్ కానుంది. మొత్తానికి స్టార్ హీరోయిన్లు సైతం ఓటీటీలకు రెడీ అవుతున్నారంటే చిన్న సినిమాలు కూడా ఈ బాట పట్టడం ఖాయంగా కనిపిస్తుంది.













