తన సినిమాకు పిల్లలకు నో ఎంట్రీ అంటున్న నాని
డైరెక్టర్ వివేక్ ఆత్రేయను ఎవరూ నమ్మనంతగా నమ్మి సరిపోదా శనివారం సినిమా చేసి గొప్ప ఫలితాన్ని అందుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమా వారం తిరక్కుండానే రూ.60 కోట్ల గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోని వరదలు, గబ్బర్ సింగ్ రీరిలీజ్ ఏదీ ఈ సినిమా కలెక్షన్లను ఆపలేకపోయింది. తమిళనాడులో కూడా సరిపోదా శనివారంకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
ఇదిలా ఉంటే నాని తర్వాతి రెండు సినిమాలు ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి. అందులో ఒకటి హిట్3 కాగా రెండోది దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో. హిట్3 స్క్రిప్ట్ ఇప్పటికే లాకైపోయిందని సమాచారం. శ్రీకాంత్ సినిమా కోసం సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో భారీ సెట్ల నిర్మాణం జరుగుతుంది. రీసెంట్ గా నాని ఓ ఇంటర్వ్యూలో తన తర్వాతి సినిమాలో వయొలెన్స్ ఎక్కువగా ఉంటుందని, ఆ సినిమాకు చిన్న పిల్లలకు అనుమతి లేదని తేల్చి చెప్పాడు.
దీంతో నాని చెప్పింది హిట్3 నా లేక శ్రీకాంత్ ఓదెల సినిమానా అనేది తెలీదు కానీ నాని చెప్పింది హిట్3 గురించే అని అందరూ అభిప్రాయ పడుతున్నారు. హిట్2లోనే నాని క్యారెక్టర్ ఎంత క్రూరంగా ఉంటుందో హిట్ ఇచ్చారు. హీరోనే అంత క్రూరంగా ఉంటే ఇక విలన్లు చేసే వయొలెన్స్ ఎంత క్రూరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి నాని మాటల ద్వారా హిట్3లో చాలా దారుణంగా వయొలెన్స్ ఉంటుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్సుంది.













