టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వి.దొరస్వామి రాజు కన్నుమూశారు. సీతారామయ్యగారి మనవరాలు, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, కిరాయిదాదా, అన్నమయ్య, సింహాద్రి, వెంగమాంబ, భలేపెళ్లాం వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన దొరస్వామి కొద్ది కాలంగా అనారోగ్యంతో బంజారా హిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కన్నుమూశారు. డిస్ట్రిబ్యూటర్‌గాను తెలుగు సినీ పరిశ్రమలో సత్తా చాటిన దొరస్వామి ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహబలుడు సినిమాను తొలి సారి పంపిణీ చేశాడు.
వీఎంసీ (విజయ మల్లీశ్వరి కంబైన్స్) పేరుతో డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్థాపించిన దొరస్వామి డ్రైవర్ రాముడు, వేటగాడు, యుగంధర్, గజదొంగ, ప్రేమాభిషేకం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి సినిమాలను తన సంస్థ పేరిట విడుదల చేశారు. సినిమాలే కాక రాజకీయాలలోను తనదైన ముద్ర వేసుకున్న దొరస్వామి 1994లో నగరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీటీడీ బోర్డు మెంబర్‌గా, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కౌన్సిల్ ప్రెసిడెంట్, ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా ఆయన పని చేశారు. దొరస్వామి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు.













